Lady Aghori: అఘోరీ మాత మరోమారు హల్చల్ చేశారు. ఈసారి అఘోరీ మాత హల్చల్ చేసింది ఎక్కడో కాదు ఏపీ రాజధాని అమరావతిలో. మొన్న శ్రీకాళహస్తిలో స్వామి దర్శనం సమయంలో, అఘోరీ మాత ఆత్మార్పణ చేసుకుంటానని హల్చల్ చేయడం, పోలీసులు నివారించడం, ఆపై కారు ప్రమాదం ఇలా వార్తల్లో నిలిచారు ఆమె. తాజాగా మరోమారు అమరావతిలో కూడా ఇదే రీతిలో హల్చల్ చేసి, చివరకు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అఘోరీ మాత సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణకు చెందిన అఘోరీ మాత, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకెక్కారు. అంతేకాదు తెలంగాణ నుండి వెళ్లిన అఘోరీ, తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు. తన ఆత్మార్పణం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా, భక్తులు అలర్ట్ కాగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి వేములవాడ వద్ద అఘోరీని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమె స్వగ్రామం కుశ్నపల్లికి తరలించారు. అక్కడ కొంతసేపు హడావుడి కూడా నెలకొంది. పోలీసులు ఆత్మార్పణం వద్దని కోరడం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకొని నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ఏమి చెప్పినా వింటామని అఘోరీ మాతకు మాటిచ్చారు. దీనితో అఘోరీ కొంత వెనుకడుగు వేయగా, పోలీసులు ఆమెను కాన్వాయ్ తో రాష్ట్రం దాటించారు.
కార్తీక మాసం ప్రారంభమైన సమయం నుండి ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత దర్శిస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి వద్ద వస్త్రధారణ పాటించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ కు యత్నించారు అఘోరీ. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు నివారించి, సాయంత్రం దర్శనం చేయించారు. మరల శుక్రవారం తెల్లవారుజామున మాత కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదానికి కారణం పోలీసులేనంటూ అఘోరీ మాత ఆరోపించారు. ఇలా శ్రీకాళహస్తి వద్ద హల్చల్ చేసిన మాత, ఉన్నట్లుండి కర్నూల్ లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ కూడా కాలినడక సాగించి, యాగంటి క్షేత్రాన్ని దర్శించారు.
తాజాగా అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో అఘోరి పూజలు నిర్వహించేందుకు వచ్చారు. అయితే అంతకు ముందు స్నానాల ఘాట్‌లోకి కారుతో సహా వెళ్లే ప్రయత్నం చేయగా.. కారును పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కొద్దిసేపు అక్కడ హడావుడి నెలకొంది. అనంతరం కారును రాళ్లు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. చిట్టచివరకు పోలీసులు అతిథి మర్యాదలతో అఘోరికి స్వామివారి దర్శనం చేయించారు.
Also Read: Ram Gopal Varma : ఆర్జీవిపై కేసు నమోదు… అప్పుడేదో తప్పించుకున్నాడు… ఇప్పుడు ఇక తప్పదు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని, ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఇలాంటి చేష్టలు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అటువంటి వారిని ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇప్పటి నుండి ఎవరైనా ఇలా మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కోసి కారం పెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అఘోరీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.