Rain Alert: నైరుతి రుతుపవనాలు ఓ వైపు.. మరోవైపు ఒడిషా ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ-మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
ఏపీ-తెలంగాణల్లో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించింది. రానున్న 48 గంటల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్ వైపు కదులుతున్నట్లు భావిస్తోంది. ఈ ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు ఏపీ-తెలంగాణల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఆగస్టు 24 అనగా సోమవారం ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షాలు పడతాయని తెలిపింది.
తొలుత జల్లులతో ప్రారంభమై ఆ తర్వాత ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రోజంతా మేఘాలు కదులుతాయని, వర్షం పడే సమయంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలియజేసింది. ఇక హైదరాబాద్ సిటీలోని రానున్న రెండు గంటల్లో పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సీ పురం, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఖైరతాబాద్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, బీఈసీబీట్, బీఈసీబీట్ తదుపరి ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాగల 2 నుంచి 3 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ములుగు అంతటా రానున్న రెండు గంటలు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది. అల్పపీడన ప్రభావం ఏపీపై ఈసారి భారీగా పడనుందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో రోజంతా వర్షాలు పడనున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.
ALSO READ: ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్!
బంగాళాఖాతంలో గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోందని, తీరానికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ రీత్యా చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తేమ ఎక్కువగా ఉండడంతో రాయలసీమలో వర్షాలు తక్కువగా పడతాయని పేర్కొంది.