AP Liquor Case: ఏపీలో లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుందా? సిట్ దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు ఈడీ కూడా జోరుగా విచారణ చేస్తుందా? ఈ కేసులో రాజకీయ నేతలపై ఫోకస్ చేసిందా?తాజాగా వైసీపీ మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావుని ఆదివారం సాయంత్రం ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియగానే వైసీపీ కీలక నేతల్లో గుబులు మొదలైంది. ఇంకా కొందరు నేతలకు కష్టాలు తప్పవనే వాదన అప్పుడే మొదలైంది.
ఏపీలో లిక్కర్ కుంభకోణం వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో రాజకీయ నేతల వంతు అయ్యింది. సిట్ దర్యాప్తు విషయాన్ని కాసేపు పక్కన బెడితే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఆదివారం సాయంత్రం ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియగానే వైసీపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఉన్నట్లుండి కారుమూరి నాగేశ్వరరావుని ఎందుకు అరెస్ట్ చేసింది? అందులో ఆయన ప్రమేయం ఏంటి?
అనే విషయాలు గోప్యంగా ఉంచింది ఈడీ. సోమవారం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచే క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. మరో నలుగురు నేతలకు అరెస్ట్ కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి కారుమూరి తన స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కొడుకుతోపాటు పలువురు నిందితులను ఈడీ అరెస్టు చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేసిన రాజ్ కసిరెడ్డి సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పారు. ప్రధాన కాంట్రాక్టులు ఆ సంస్థకు దక్కేలా నిబంధనలు సడలించారు. మద్యం రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96 శాతం నిధులు లిక్కర్ సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కేవలం నాలుగు శాతం మాత్రం సిగ్మా తీసుకుంది.
96 శాతం నిధులు కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన శ్రీ సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ ఖాతాల్లోకి రూ.68 కోట్లు వెళ్లాయట. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఖాతాలోకి రూ.15 కోట్లు, ఆయన కోడలు ఖాతాల్లోకి రూ.9.5 కోట్లు, కొడుకు సునీల్ ఖాతాల్లోకి నిధులు చేరినట్లు గుర్తించింది ఈడీ. ఇప్పటికే సునీల్‌ను అరెస్టు చేసింది ఈడీ. ఇప్పుడు నాగేశ్వరరావు వంతైంది.
ఈ కేసులో విచారణకు రావాలని ఇదివరకు నాగేశ్వరరావుకు నోటీసు ఇచ్చింది ఈడీ. అనారోగ్య కారణాలు చూపి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయన కదలికలపై కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ఈడీ, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన స్నేహితుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుంది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే ఆయన కొడుకుతోపాటు పలువురు నిందితులను అరెస్టు చేసింది.
ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణలకు భారీ వర్ష సూచన
ఈడీ స్వయంగా అరెస్టు చేయడంతో నిందితులకు ఇప్పట్లో బెయిల్ కష్టం. వైసీపీకి చెందిన మరో నలుగురు నేతల మెడకు ఈ కేసు బిగుసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే ఆయా నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. కోర్టులో నాగేశ్వరరావుని హాజరుపర్చిన తర్వాత ఆయనను విచారించేందుకు పిటిషన్ వేయనుంది ఈడీ. ఆయనతోపాటు మిగతా నిందితులను విచారించిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట. ఏడాదిగా స్తబ్ధుగా ఉన్న లిక్కర్ కేసు, మాజీమంత్రి అరెస్ట్‌తో వైసీపీ కీలక నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.