Central Govt Jobs RTI| కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 8.23 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఒక ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అధికారిక సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో మంజూరైన ప్రతి 5 పోస్టుల్లో దాదుగా ఒకటి ఖాళీగా ఉంది. ఈ ఖాళీలు.. రైల్వే, రక్షణ, హోం, పోస్టల్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలు చేసిన ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటపడింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అయితే ఈ గణాంకాలు 2024 మార్చి 1 నాటికి ఉన్న పరిస్థితిని చూపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ సంఖ్యలో పెద్దగా మార్పు ఉండే అవకాశాలు తక్కువ.
2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 39,23,212 పోస్టులు మంజూరయ్యాయి. అయితే, వాటిలో 30,99,556 పోస్టుల్లో మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో మొత్తం 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్టీఐ సమాధానం వెల్లడించింది. ఈ ఖాళీలు మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 21 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ఖాళీలు చేర్చలేదు. అందువల్ల ఈ సంఖ్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంబంధిత శాఖలకు మాత్రమే వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వంలోని అత్యధిక ఖాళీలలో రక్షణ శాఖకు చెందిన సివిలియన్ పోస్టులు కూడా ఉన్నాయి. రక్షణ శాఖలో 2.42 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం వెల్లడించింది.
భారతీయ రైల్వేల్లో కూడా 2,40,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రైల్వేల్లో మొత్తం 14.79 లక్షలకు పైగా పోస్టులు మంజూరయ్యాయి.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ మూడు శాఖల్లో కలిపి 5.93 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టల్ శాఖలో మొత్తం 2,53,124 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 61,546 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
రెవెన్యూ శాఖలో 1,79,374 మంజూరైన పోస్టుల్లో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కార్మిక శాఖలో కూడా 41 శాతానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
వ్యవసాయం, పర్యావరణం, ఉన్నత విద్య వంటి శాఖల్లో కూడా సిబ్బంది కొరత కనిపిస్తోంది.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 1,855 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 34 శాతంగా ఉంది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో 2,393 పోస్టులు మంజూరయ్యాయి. అందులో 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే మత్స్య శాఖలో కూడా 664 పోస్టుల్లో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Also Read: ఎస్‌బిఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? ఇకపై తక్కువ వడ్డీ.. కొత్త రేట్లు ఇవే
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 1,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులకు 34 ఖాళీలు ఉన్నాయి. ఆయుష్ శాఖలో మొత్తం 432 పోస్టులకు 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉన్నత విద్యా శాఖలో 1,414 పోస్టుల్లో 522 ఖాళీగా ఉన్నాయి.
పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖలో 365 పోస్టుల్లో 87 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Also Read: అవసరం తీరాక మర్చిపోతారు.. ఈ రాశులలో జన్మించిన వారు స్వార్థపరులు
రాష్ట్రపతి సచివాలయంలో 803 మంజూరైన పోస్టుల్లో 287 ఖాళీగా ఉన్నాయి.
ప్రధానమంత్రి కార్యాలయంలో 441 పోస్టులకు 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఆర్టీఐ వివరాలు కేంద్ర ప్రభుత్వంలోని అనేక శాఖల్లో సిబ్బంది కొరతను స్పష్టంగా చూపిస్తున్నాయి. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు ఈ ఖాళీలు నియామకాల అవకాశాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.