Rains Alert In AP: దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి శుక్రవారం ఏపీలో వర్షాలు పడే అవకాశముంది. అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ప్రధాన పండగలకు తుఫాన్లు లేకుంటే ముసురు రావడం చూస్తుంటాము. వినాయక చవితి, దసరాకు తుఫాన్లు వస్తుంటాయి. ఇప్పుడు దసరా వంతైంది. తాజాగా ఏపీలో వాతావరణం అప్పుడే మారిపోయింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉండడంతో అక్టోబర్ 13 నుంచి 19 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని కారణంగా దక్షిణ ద్వీపకల్పంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ వెబ్సైట్ స్కైమెట్ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుకున్న ప్రాంతాలపై అల్ప స్థాయి తుఫాను వలయం ఏర్పడిందని తెలిపింది. ఇది మరింత బలపడి అల్పపీడనం ఏర్పడటానికి దారితీసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ-మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతాలకు సమీపంలో ఉంటుందని అంచనా వేసింది. ఈ క్రమంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 13-15 మధ్య తేదీల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అల్పపీడనం కాస్త అక్టోబర్ 16న భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, దీని కారణంగా తమిళనాడు, దక్షిణ కర్ణాటక, రాయలసీమ, కేరళ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దక్షిణ ద్వీపకల్పంపై ఈశాన్య రుతుపవనాల ఆరంభానికి ఈ అల్పపీడన ప్రాంతం దోహదపడగలదని స్కైమెట్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ దేశ వ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది.
ALSO READ: ‘లోకల్’పై కూటమి పార్టీల తర్జనభర్జన.. మంగళవారం మరోసారి భేటీ, తేలకుంటే ఫ్రెండ్లీ పోటీకి అవకాశం
దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, యానాంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఏపీ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు అధికారులు.