Amaravati: పండగల వేళ నేపథ్యంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్యులకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందనున్నాయి. మొబైల్ వాహనాల్లో విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
దీపావళి పండుగ వేళ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం, కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి వంటి నిత్యావసర వస్తువులను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ధరణి బ్రాండ్ నాణ్యమైన బియ్యం అమ్మకాలను రైతు బజార్లకే పరిమితం చేయకుండా మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు విస్తరించాలని ఆదేశించారు. వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉండేలా అధికారులు మొబైల్ వాహనాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. సన్న బియ్యం కిలో రూ. 49 కి, అత్యంత సన్నంగా ఉండే బియ్యం కిలో రూ. 50 లకు విక్రయించనున్నారు.
బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అరికట్టడానికి రైస్ మిల్లర్లు-టోకు వ్యాపారులతో చర్చలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. వివిధ రకాలను సరసమైన ధరలకు అందించడానికి ఆయా సంఘాల ప్రతినిధులు అంగీకరించారు. మిల్లర్లు బీపీటీ స్టీమ్ రైస్‌ను కిలోకు రూ. 66 చొప్పున, సాధారణ స్టీమ్ రైస్‌ను కిలోకు రూ. 47 చొప్పున విక్రయించడానికి అంగీకరించినట్టు తెలియజేశారు.
పొరుగు రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణాను నివారించడానికి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్ గేట్ల వద్ద నిఘాను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా పీడీఎస్ ద్వారా కిలో కందిపప్పును రూ. 100 లకు సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలోకు రూ. 170 నుంచి రూ. 200 ఉంది. కుటుంబాలపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని నొక్కి చెప్పారు.
ALSO READ: అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా
రేషన్ షాపుల ద్వారా పామాయిల్‌ను లీటరు రూ.125, గోధుమ పిండి కిలోకు రూ.25 లకు సరఫరా చేయాలన్నారు. దీపావళికి ముందు ఈ మూడు నిత్యావసర వస్తువులను రేషన్ డిపోల ద్వారా అందుబాటులో ఉంచాలన్నారు. అదే సమయంలో ఉల్లి ధరలను సమీక్ష చేసిన అధికారులు, రైతు బజార్లలో ఉల్లి కిలో రూ. 35 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 800 మెట్రిక్ టన్నుల ఉల్లి సేకరించి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు.
ధరల హెచ్చుతగ్గుల నుండి వినియోగదారులను కాపాడటానికి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట జోక్యం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం వల్ల ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 100 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.