Local body elections in AP: స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య రచ్చ రాజేసిందా? జనసేన-బీజేపీ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? అసెంబ్లీ కంటే రెట్టింపు సీట్లు ఈ రెండు పార్టీలు కోరుతున్నాయా? దీనికితోడు రిజర్వేషన్ల వ్యవహారంపై ఆ రెండు పార్టీల నేతలు గుర్రుగా ఉన్నాయా? మంగళవారం భేటీ ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి పార్టీల మధ్య కాస్త విభేదాలు వచ్చినట్టు కనిపిస్తు్న్నాయి. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువగా జనసేన-బీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో తొలుత సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ మాధవ్, నాదెండ్ల మనోహర్ భేటీల చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. మంగళవారం మూడు పార్టీల నేతలు మరోసారి భేటీ కానున్నారు. మంగళవారం తేలకుంటే, మూడు పార్టీలు ఫ్రెండ్లీగా పోటీ చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు.
సీఎం చంద్రబాబు నివాసంలో సోమవారం కూటమి పార్టీల నేతలు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్డీయే సమన్వయ కమిటీ సభ్యుడు మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్లతో సంబంధం లేకుండా తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సీట్లు కేటాయించాలని జనసేన-బీజేపీ నేతలు, టీడీపీని కోరినట్లు తెలుస్తోంది.
ఆ లెక్కన పరిశీలిస్తే.. 2024లో జనసేనకు 12 శాతం సీట్లు కేటాయించగా, స్థానిక ఎన్నికల్లో 20 నుంచి 25 శాతం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే మూడు కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీలు ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తుంది. ఇక బీజేపీకి విషయానికి వద్దాం. ఆ పార్టీకి గత ఎన్నికల్లో దాదాపు 5 శాతం సీట్లు కేటాయించారు. ఈసారి 10 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటి లేదా 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలు డిమాండ్ చేసినట్టు సమాచారం. జనసేన-బీజేపీ ప్రతిపాదనలపై చర్చలు జరిపిన కూటమి నేతలు, ఓ అవగాహనకు వచ్చినట్లు టీడీపీ వర్గాల మాట. ఏయే స్థానాలు కేటాయించాలనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.
ALSO READ: తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్.. ఇక మీ వెంట వెంకటాద్రి, ఇంకెందుకు ఆలస్యం
దీంతో కూటమి పార్టీల మధ్య మంగళవారం సమావేశం కీలక కానుంది. ఇవాళ మధ్యాహ్నం జనసేన అధినేత పవన్‌తో పల్లా శ్రీనివాసరావు, నిమ్మల సమావేశం కానున్నారు. అందులో ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. దీనికితోడు ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు రిజర్వేషన్లను ప్రకటించడంతో జనసేన-బీజేపీకి కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్ల గురించి ముందు తెలిస్తే బాగుండేదని పలువురు నేతలు అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది. వెంటనే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని, రిజర్వేషన్ల ఖరారు అనేది మన చేతుల్లో ఉండదని, ప్రత్యేక కమిషన్ ద్వారా ఖరారయ్యే రిజర్వేషన్ల ప్రక్రియలో జోక్యం చేసుకోమని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని నేతలతో అన్నట్లు చెబుతున్నారు.
కొత్త రిజర్వేషన్ల ప్రకారం.. ఆయా స్థానాల ఎంపిక అభ్యర్థులు ఎవరు? అనేది పార్టీల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని జనసేన-బీజేపీ కోరడంతో నేటికి భేటీ వాయిదా పడింది. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లను మాకు కేటాయించాలని బీజేపీ కోరినట్లు తెలిసింది. నెల్లూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో అక్కడ బీజేపీ పోటీ చేయడం కరెక్టు కాదని టీడీపీ నేతలు సూచించారట. దీంతో తిరుపతి స్థానం ఇవ్వాలని కోరారట. అక్కడి నుంచి టీడీపీ బరిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరొకటి కార్పొరేషన్ ఎంపిక చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. జనసేనకు కేటాయించే మూడు కార్పొరేషన్ స్థానాలపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీ విజయవాడ-మచిలీపట్నం-కాకినాడ కార్పొరేషన్లు కోరుతోంది. మచిలిపట్నం లేకుంటే బెజవాడ సీటు ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు ఇవ్వడం కరెక్టు కాదని, దీనివల్ల దిగువ స్థాయి నేతల మధ్య విభేదాలు వచ్చే అవకాశముందని ఓ అంచనా.