Narayana Swamy: చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జెడ్పీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో తనపై, తన కారుపై ప్రత్యర్థులు దాడులకు తెగబడ్డారని మాజీ డిప్యూటీ సీఎం కె. నారాయణస్వామి మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీ మూకలతో దాడులు
బీగాలు రమేష్, ఆయన కుటుంబ సభ్యులు, పాల జనార్ధన్‌లతో పాటు ఎమ్మెల్యే థామస్ డాక్టర్ వృత్తిలో ఉండి కూడా తమిళనాడు ప్రాంతం నుంచి రౌడీలను రప్పించి ఈ దాడులు చేయించారని నారాయణస్వామి ఆరోపించారు. స్థానిక కళ్యాణ మండపాలు, గ్యాస్ గోడౌన్ల వద్ద దాదాపు 300 మంది దొంగలను, అరాచక శక్తులను సమీకరించి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. ఎస్.ఆర్ పురంలో జ్యోతి రెడ్డి దాడి చేసిన వీడియోలు, జి.డి.నెల్లూరులో మోహన కుమారి నామినేషన్ చింపేయడం, జెడ్పీ హాల్లోనే అభ్యర్థి నిరీషా రెడ్డిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు.
అధికారులకు హెచ్చరిక.. సీబీఐ విచారణ
1985నాటి సంచలనాత్మక పాదిరికుప్పం ఘటనలో పోరాటాలు చేసినప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదని గుర్తుచేశారు. ఈ ఘటనపై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనందున (127/2026), నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను హెచ్చరిస్తూ.. ఈ రోజు అధికార పార్టీ మాటలు విని తప్పులు చేస్తే, రేపు చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని కోరారు.
పవన్ కళ్యాణ్ స్పందించాలి
మహిళా అభ్యర్థులపై జరుగుతున్న దౌర్జన్యాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, వాటిని వదిలేసి భయానక వాతావరణం సృష్టించి స్థానిక సంస్థల స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ దౌర్జన్యాలన్నింటిపై ఖచ్చితంగా సీబీఐ విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు.
Also Read: అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.. అర్నబ్ తుఫాను నష్టంపై కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి