Amaravati: సీఎం చంద్రబాబుకు కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ లేఖ రాశారు. ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఈనెల 18, 19న శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరిగే జంతు బలులను నిషేధించాలని అందులో ప్రస్తావించారు. దేశంలో అత్యంత దారుణమైన సామూహిక హత్యల్లో ఒకటిగా మారిందన్నారు.
సీఎం చంద్రబాబుకు మేనకాగాంధీ లేఖ
ఏటా ఆ ప్రాంతంలో జరుగుతున్న జంతు బలుల గురించి వందలాది మంది యువకులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు వంటి నిపుణులు తనకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వేలాది జంతువులను ఏ కారణం లేకుండా చంపుతున్నారని రాసుకొచ్చారు.
దేశంలోనే అత్యంత ఆధునిక, ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రుల్లో మీరు ఒకరని ప్రస్తావిస్తూనే, దీనిని ఆపడం మీకు సాధ్యం కాదా? అంటూ ప్రశ్న రైజ్ చేశారు. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం జంతు బలిని నిషేధించిందని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు.
దయచేసి ఆపండి, మారణకాండ గురించి మీరేమీ చేయలేరా? అంటూ ప్రస్తావన
చివరకు కర్ణాటక దాదాపు అదేస్థాయిలోనే ఆంక్షలు విదించిందన్నారు. ఇది ముమ్మాటికీ హింసను ప్రోత్సహిస్తుందని, అది సమాజానికి చెడు తెస్తుందన్నారు. ఆలయానికి జంతు బలి కోసం వచ్చేవారిలో చాలామంది తాగి ఉంటారని, ఎవరూ దేవతకు నైవేద్యంగా చేయరన్నారు. ఎటువంటి పరిణామాలు లేకుండా హింసకు పాల్పడే అవకాశం లభిస్తుందన్నారు.
దయచేసి దీనిని ఆపమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. జరగబోయే ఈ మారణకాండను యావత్ దేశం చూస్తోందని, దీనివల్ల దేశ యువత నుండి ప్రశంసలు మాత్రమే లభిస్తాయన్నారు. ఆలయాన్ని మరింత అందమైన ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి మీరు నిధులు ఇవ్వవచ్చని వివరించారు.
జంతు బలులకు బదులుగా కొబ్బరికాయలను సమర్పించమని ప్రజలు కోరవచ్చని, కర్ణాటక అదే చేసిందన్నారు. సతీ సహగమనం, దొంగచాటు పోరాటాలు, కోడిపందాలు వాటిని రద్దు చేశారని ఆ లేఖలో రాసుకొచ్చారు. జూదం, మద్యం సేవించడం, ఇంట్లో తయారు చేసుకున్న మత్తు పదార్థాలు తీసుకోవడం వంటి పాత ఆచారాలు ఉన్నాయని, మనం వాటిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మరి ఆమె లేఖపై ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.