Kakinada Uppada Sea Waves: కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఉద్ధృతి కారణంగా సముద్ర కోత తీవ్ర సమస్యగా మారింది. ఉప్పాడ, సూరాడపేట, మాయపట్నం వంటి గ్రామాలు ఈ సమస్య వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. సముద్రం ఉప్పొంగడంతో మాయపట్నం గ్రామం జలమయమై, సుమారు 20 ఇళ్లు కూలిపోయాయని, 70 ఇళ్లలోకి నీరు చేరిందని స్థానికులు తెలిపారు. రక్షణ గోడలు, జియో ట్యూబ్‌లు ధ్వంసం కావడం వల్ల సముద్ర నీరు గ్రామాల్లోకి చొచ్చుకొని వస్తోంది, దీంతో గ్రామస్థులు ప్రతి క్షణం భయాందోళనతో జీవిస్తున్నారు.
బిక్కు బిక్కు మంటున్న గ్రామస్తులు
సముద్ర కోత కారణంగా గ్రామస్థులు రాత్రివేళల్లో సముద్రం ఊరిలోకి వచ్చేస్తుందేమోనని బెంబేలెత్తుతున్నారు. ఈ సమస్య వల్ల సముద్రమే జీవనాధారమైన అక్కడి ప్రజలకు ఆ కడలే వారి ఆవాసాలను కబళించేస్తుంది. ఇళ్లు-వాకిళ్లు, బడులు, గుడులు, చర్చిలు వందల ఎకరాల పంట పొలాలు, గ్రామాల్లోని ప్రధాన కట్టడాలు సాగర గర్భంలో కలిపేసుకుంటుంది. తీర ప్రాంత మత్స్యకారులకు నిలువ నీడ లేకుండా చేసి నిరాశ్రయులుగా మారుస్తోంది. సముద్ర కోత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరాల్లోని 8 గ్రామాలకు చెందిన ప్రజలకు దశాబ్దాలుగా అంతులేని వ్యథనే మిగుల్చుతోంది. గతంలో నిర్మించిన రక్షణ గోడలు, జియో ట్యూబ్‌లు పనిచేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. స్థానికులు ప్రభుత్వం నుండి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్
ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. ఆరోగ్య సమస్యల నివారణకు వైద్య సిబ్బంది, ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
శాశ్వత పరిష్కార నిర్మాణం చేపడతానన్నా పవన్
ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 323 కోట్ల రూపాయలతో టెట్రాపాడ్స్ రక్షణ గోడ నిర్మాణం చేపట్టనుందని, ఇది స్థానికులకు ఎన్నో ఏళ్ల కలగా ఉందని సమాచారం ఇచ్చారు. అలాగే, 200 కోట్లతో కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ చర్యలు సముద్ర కోత నుండి గ్రామాలను కాపాడేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు. సముద్ర కోత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్థానికులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, వీటిని వేగవంతం చేయాలని, శాశ్వత పరిష్కారం కోసం మరింత చొరవ తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరో నాలుగు రోజులు వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో నేటి నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: జగన్ తర్వాత నెంబర్ 2 బొత్సేనా?
అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ , జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.