Mega Brothers: మెగా ఇంట్లో సంబరాలకు కొదవ లేదాయే. ఔను.. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది. ఇప్పటికే సినీ ప్రపంచంలో రారాజులుగా గుర్తింపు పొందిన మెగా బ్రదర్స్, పొలిటికల్ ప్రపంచంలో కూడా రారాజులుగా గుర్తించబడే సమయం ఆసన్నమైంది. అందుకే మెగా అభిమానుల సంబరాలకు హద్దులు లేవనే చెప్పవచ్చు. అయితే మెగా ఇంట్లో ముగ్గురు మంత్రులుగా భాద్యతలు నిర్వర్తించిన రికార్డు కూడా వీరికి దక్కనుంది.
❂ మెగాస్టార్ నుండి కేంద్ర మంత్రి వరకు..
మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటికీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తే చాలు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. సినీ ప్రపంచంలో మెగాస్టార్ రేంజ్ వేరని చెప్పవచ్చు. బ్రేక్ డ్యాన్సులతో అభిమానులను అలరించిన మెగాస్టార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకున్న చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో 18 స్థానాల్లో పార్టీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత రాజకీయ అనూహ్య పరిణామాలతో 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీనితో మెగాస్టార్ చరిష్మాకు అనుగుణంగా కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఇచ్చి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవి అప్పగించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు రాజకీయాలకు స్వస్తి పలికిన చిరంజీవి, మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపారు. అలాగే మెగాస్టార్ కు పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. మొత్తం మీద సినీ ప్రపంచం నుండి రాజకీయాల వైపు అడుగులు వేసిన మెగాస్టార్ కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లారు.
❂ పవర్ స్టార్ నుండి డిప్యూటీ పవర్ వరకు..
ఇక మరో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. సినిమాలలో హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత అభిమానులు ఎక్కువని చెప్పవచ్చు. పవన్ సినిమాలో నటిస్తే చాలు, ఆ థియేటర్ల వద్ద హంగామా అంతా ఇంతా కాదు. ఇలా సినిమాలలో హీరోగా డై హార్డ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పవన్.. పాలిటిక్స్ లో తన అన్న మెగాస్టార్ కు భిన్నంగా అడుగులు వేసి విజయాలను అందుకున్నారు. తన అభిమానులనే బలంగా మార్చుకొని జనసేన పార్టీని స్థాపించి ఒక్కొక్క అడుగు విజయం వైపు వేశారని చెప్పవచ్చు. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ ఎదిగారంటే, ఆయన వేసిన ఒక్కొక్క అడుగు ఎంతో కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. 2024 ఏపీ ఎన్నికల్లో పవన్ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం.. విజయానికి దగ్గరికి తీసుకు వెళ్ళిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు.
❂ పవన్ అడుగులు.. విజయతీరాలకు..
బీజేపీతో దోస్తీ చేస్తూ టీడీపీకి ఆపన్నహస్తం అందించి వైసీపీకి ఘోర ఓటమి అందించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అందుకే దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కూటమి 164 సీట్లు దక్కించుకుంది. పవన్ గురించి సీఎం చంద్రబాబు ఓ సారి మాట్లాడుతూ.. పవన్ అందించిన సహకారం మరువలేనిదని చెబుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబును జైలుకు తరలించిన సమయంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు నేడు విజయవకాశాలుగా మారాయని చెప్పవచ్చు. ఇప్పటికీ టీడీపీ, బీజేపీలతో అదే దోస్తీ కొనసాగిస్తూ పవన్, రాజకీయ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
కూటమి విజయం అలా ఉంచితే, పవన్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కడంతో మెగా అభిమానులకు హద్దు లేకుండా పోయింది. పిఠాపురంలో పవన్ విజయాన్ని అందుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆ ఆనంద క్షణాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా పవన్ వేసే ప్రతి అడుగు విజయాలను అందించిందనే చెప్పవచ్చు. అందుకే పవన్ కు ఇప్పుడు సినీ అభిమానుల కంటే, రాజకీయ అభిమనులే ఎక్కువని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం ఎక్కడికి వెళ్లినా పవన్ సింప్లిసిటీ అంటారు ప్రజలు.
❂ నాగబాబు అను నేను..
అలాగే మరో మెగా బ్రదర్ నాగబాబు. తన అన్న మెగాస్టార్ గీసిన గీతను నాగబాబు దాటరని అంటుంటారు. అన్న ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో నాగబాబు కీలకంగా వ్యవహరించారు. అయితే నాగబాబు ఇచ్చిన మద్దతు అంతగా బహిర్గతం కాలేదని చెప్పవచ్చు. నాగబాబు కూడా సినిమాలలో నటించారు. ఎన్నో పాత్రలతో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తమ్ముడు జనసేన పార్టీని స్థాపించిన సమయం నుండి నాగబాబు కీలకంగా వ్యవహరించారు. తమ్ముడికి అండదండగా ఉంటూ.. ఎక్కడ కూడా మచ్చలేని మహారాజుగా నాగబాబు పేరు తెచ్చుకున్నారు. రాజకీయ విమర్శలు చేయడంలో నాగబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీలో జరిగిన గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పటిష్టతకు నాగబాబు విశేష కృషి చేశారు.
అయితే ఆడంబరం లేని జీవితాలు అలవాటుగా మార్చుకున్న మెగా బ్రదర్స్.. ఇప్పటికీ పొలిటికల్ ప్రపంచంలో అదే పంథాను కొనసాగిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే, తన అన్న నాగబాబుకు ఏదొక పదవి ఇవ్వాలన్న తలంపును పవన్ భావించారు. ఇప్పటికే మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్, తన పార్టీ కోసం కష్టపడ్డ అన్నకు పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయంపై ఓ సారి పవన్ మాట్లాడుతూ.. తన అన్న స్థానంలో ఎవరున్నా, పదవి ఇప్పించేవాడినని చెప్పుకొచ్చారు.
Also Read: AP Govt – Rapido: ఏపీ మహిళలకు సరికొత్త ఉపాధి.. అమ్మాయిలూ ఇది మీ కోసమే!
అయితే నాగబాబుకు పదవి కట్టబెట్టే అవకాశం రానే వచ్చింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది. అంతేకాదు ఇప్పటికే నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు ముందుగా ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి నాగబాబుకు వరించనుందని చెప్పవచ్చు. శుక్రవారం మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ పర్వం సాగనుంది. ఇక విజయం కూడా ఖాయం కావడంతో, ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే, నాగబాబు అను నేను.. అంటూ మంత్రిగా ప్రమాణం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భావించవచ్చు. మొత్తం మీద మెగా బ్రదర్స్ ముగ్గురూ.. ముగ్గురేనని, ముగ్గురూ మంత్రులయ్యే అవకాశాలు దక్కించుకున్నారని మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఎంతైనా మెగా బ్రదర్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది కదా మరి.. ఆ రేంజ్ లో సంబరాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.