AP Govt – Rapido: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ నానుడి ప్రకారం మహిళలు కుటుంబ భాద్యతల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకే మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. త్వరలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చితే, ఎందరో మహిళలకు ఉపాధి దక్కనుంది.
ఇప్పటి వరకు ర్యాపిడో అంటే కేవలం పురుషులే ర్యాపిడో బైక్స్, ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. అయితే మహిళలు ర్యాపిడో బుక్ చేసిన సమయంలో మహిళా రైడర్లు లేకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుండి మహిళలను బయట పడేసేందుకు ఏపీ ప్రభుత్వం.. మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. మహిళా రైడర్ లు అందుబాటులోకి వస్తే, ఓ వైపు మహిళల రక్షణ, మరోవైపు మహిళలకు ఉపాధినిచ్చినట్లు ఉంటుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఆలోచిస్తుందట.
దీనితో ఏపీలోని ప్రధాన నగరాలలో మహిళా రైడర్లు అందుబాటులోకి రానున్నారు. ఇలా మహిళా రైడర్లుగా అవకాశం కల్పించేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఎందరో మహిళలు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఒక వరమని చెప్పవచ్చు. అలాగే నేటి రోజుల్లో ప్రతి మహిళా స్కూటీలు నడుపుతున్నారు. అలాంటి మహిళలకు మహిళా రైడర్లుగా అవకాశం కల్పిస్తే, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ప్రభుత్వం ఇప్పటికే ర్యాపిడో సంస్థతో మహిళా రైడర్ల విషయంపై చర్చించినట్లు సమాచారం.
ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఈ సేవలు రానున్నాయని తెలుస్తోంది. ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుమారు 400 ఈ – బైక్స్, ఈ – ఆటోలు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో ముందుగా ఈ నగరాలలో మహిళా రైడర్లు తమ సేవలు అందించనున్నారు. అంతేకాదు వీరికి నెలకు 300 బుకింగ్స్ అందించేందుకు ర్యాపిడో సంస్థ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అదే జరిగితే మహిళల రక్షణతో పాటు మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం అందినట్లే.
Also Read: Electricity Bill Save Tips: సమ్మర్ లో ఇలా చేయండి.. మీ ఇంటికి కరెంట్ బిల్?
ఆ తర్వాత కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి చిన్న నగరాల్లో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నగరాలకు 200 వాహనాలు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే వాహనాల కొనుగోలుకు రుణాలు అందించేందుకు ప్రభుత్వ సిద్దమైందట. స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పవచ్చు. తొలుత విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ప్రారంభం కానుండగా, ఆ నగరాలలో గల మహిళలకు ఉపాధి లభిస్తుంది. మొత్తం మీద ప్రభుత్వం దీనిని కార్యరూపం దాల్చితే చాలు, ఎందరో మహిళలకు మేలు చేకూరుతుందని మహిళా సంఘాలు తెలుపుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.