AP Council Session: ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మాజీ సీఎం జగన్ శాసనసభకు రాకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్సీలు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభంలో మంత్రి నారా లోకేష్-వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య డైలాగ్స్ వార్ తారాస్థాయికి చేరింది.
మండలి సమావేశాలు మొదలుకాగానే విద్యా వ్యవస్థలో ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ బకాయిల అంశంపై అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. విద్యా రంగంలో గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిల గురించి ప్రస్తావించారు మంత్రి లోకేశ్. ఈ క్రమంలో విపక్ష నేత బొత్స చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ సభ్యులు బీఏసీలో పెట్టని అంశాలను చర్చకు తెస్తున్నారన్నారు మంత్రి లోకేష్. ఈ విషయంలో సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిలదీశారు. సభకు సంబంధం లేని అంశాలను ముందుకు తీసుకొచ్చి చర్చకు పెట్టాలనడం సరైందని కాదన్నారు. సభను మీరు నడిపిస్తారా అంటూ బొత్సను లోకేష్ ప్రశ్నించారు.
తన పట్ల మంత్రి లోకేష్ అమర్యాదగా మాట్లాడారని ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. హూ ఆర్ యూ టు రన్ ద హౌస్ అన్నారని విపక్షనేత వివరించారు. రికార్డుల నుంచి అనుచిత వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే జోక్యం చేసుకున్న మంత్రి లోకేష్, తాను ఎలాంటి అమర్యాద వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ALSO READ: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలను పాటిస్తున్న వైసీపీ నేతలు
మీరు అడుగుతున్న విషయాలపై అంత ఆసక్తి ఉంటే ఛైర్మన్‌తో మాట్లాడి ఎజెండాలో పెడితే బాగుండేదన్నారు. తాము సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రిగా సభలో సమాధానం చెప్పే హక్కు లేదని ప్రతిపక్ష నేత ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. 2023-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం 1750 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టిందని వివరించారు సదరు మంత్రి.
అందుకే ఈ అంశాన్ని బీఏసీలో పెట్టలేదన్నారు. ఎడ్యుకేషన్ విభాగంపై ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమేనన్నారు. గతంలో కూడా ఇదే సబ్జెక్టుపై మాట్లాడుతున్న సమయంలో బొత్స వాకౌట్ చేశారని సభ దృష్టికి తెచ్చారు మంత్రి. మీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని అన్నారు. దీనిపై సరైన ఫార్మాట్‌లో రావాలని చర్చకు తాను సిద్ధమేనన్నారు మంత్రి లోకేష్.
శాసనమండలిలో నారా లోకేశ్ vs బొత్స
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్
విద్యారంగంలో గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిల గురించి ప్రస్తావించిన లోకేశ్
లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టిన వైసీపీ pic.twitter.com/hTgD7fNO3X
— BIG TV Breaking News (@bigtvtelugu) September 23, 2025