హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో వైసీపీ చేసిన హడావిడి అందరికీ తెలుసు. ఆ సినిమా గురించి రకరకాల జోకులు పేలాయి, నేరుగా వైసీపీ నేతలే ట్రోలింగ్ కి దిగారు. అంబటి రాంబాబు వెటకారంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు ఓజీ రిలీజ్ కి వేళయింది. కానీ వైసీపీ నుంచి ఒక్క కామెంట్ కూడా బయటకు రాలేదు. అంబటి లాంటి వాళ్లు కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఓజీ టికెట్ రేట్లు పెంచడాన్ని కొంతమంది హైలైట్ చేయాలని చూసినా ఎందుకో సైలెంట్ అయ్యారు. జగన్ ఆదేశాల వల్లే వైసీపీ బ్యాచ్ సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
పవన్ జోలికెళ్లొద్దు..
ఆమధ్య వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ గురించి తాను మాట్లాడనంటూ తెగేసి చెప్పారు. మీడియా పదే పదే ప్రశ్నించినా, ఎందుకు కాంట్రవర్సీ అంటూ సైలెంట్ అయ్యారు. సిద్ధార్థ్ రెడ్డి ఒక్కరే కాదు, చాలామంది వైసీపీ నేతలది కూడా ఇదే పరిస్థితి. టీడీపీని విమర్శించాలి, జనసేన విషయంలో సైలెంట్ గా ఉండాలి అనుకుంటున్నారు. జగన్ డైరెక్షన్ వల్లే ఇదంతా అని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ని కానీ, జనసేనను కానీ విమర్శించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నేతలకు స్పష్టం చేసారు జగన్. అందుకే పవన్ పై వైసీపీ విమర్శలు, ఆయన సినిమాలపై ట్రోలింగ్ బాగా తగ్గింది.
ఆ నష్టం చాలదా?
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని సవాళ్లు విసిరారు చాలామంది. సీన్ కట్ చేస్తే పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. సవాళ్లు విసిరిన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోళ్లా పడ్డారు. ఎన్నికల తర్వాత కూడా కొంతమంది పవన్ ని టార్గెట్ చేసినా దానివల్ల ఫలితం ఏంటనేది సీనియర్ల వాదన. పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, పార్టీ పరంగా విమర్శించినా కాపు సామాజిక వర్గంలో వైసీపీ పలుచన అవుతోందనే వాదన ఉంది. అందుకే పవన్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని జగన్ ఫిక్స్ అయ్యారు. గతంలో అవసరం ఉన్నా లేకపోయినా పవన్ పెళ్లిల్ల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేసిన జగన్, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తనతోపాటు తన పార్టీ నేతల విషయంలో కూడా ఆయన అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
ఓజీ సినిమా విడుదలకు సిద్ధమైన ఈ టైమ్ లో కూడా వైసీపీ సైలెంట్ గా ఉందంటే ఆ పార్టీ నేతలు జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్న ప్రతిసారీ ప్రతిపక్ష వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల పరకామణి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ అవుతోంది. పరకామణిలో దొంగతనం చేసిన సొమ్ముని దొంగలతో కలసి వైసీపీ నేతలు పంచుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది, దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. ఆ దొంగతనం జరిగింది గత టీడీపీ హయాంలోనేనని వైసీపీ అంటోంది. ఈ వివాదం నుంచి బైటపడేందుకు వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది.