Nara Lokesh Red Book: ఏపీలో రెడ్ బుక్ అంటే తెలియని వారుండరు. ఎన్నికల ముందు వినిపించిన రెడ్ బుక్, ఎన్నికల ఫలితాల తరువాత కూడ అదే స్థాయిలో వినిపించింది. రెడ్ బుక్ కు ఆజ్యం పోసింది మాత్రం నారా లోకేష్ అని అందరికీ తెలుసు. తాజాగా మరోమారు రెడ్ బుక్ పేరు వినిపిస్తోంది. అందుకు నారా లోకేష్ విదేశీ పర్యటనలో చేసిన కామెంట్స్ ఆజ్యం పోయడం విశేషం.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారన్నది టీడీపీ అభియోగం. లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన విషయంలో పార్టీ కార్యకర్తలు తాము పడుతున్న ఇబ్బందులను లోకేష్ దృష్టికి తెచ్చారు. అలాగే కొందరు ప్రజలు కూడ తమ దీనస్థితిని లోకేష్ కు తెలిపారు. దీనితో రెడ్ బుక్ ను తెరిచినట్లు, ఇందులో చట్టాలను ఉల్లంఘించిన వారి పేర్లు రాస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. అలా ఆ పుస్తకంలో మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ఉన్నాయని టాక్.
ఎన్నికలు ముగిసిన అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడే పలువురు టీడీపీ కార్యకర్తలు నేరుగా లోకేష్ ను రెడ్ బుక్ ఎప్పుడు తెరుస్తారంటూ ప్రశ్నించారు. అలా రెడ్ బుక్ తెరిచారో ఏమో కానీ, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అలాగే వైసీపీకి చెందిన కొందరిని పలు కేసులలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిఇలా ఉంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ విమర్శల పర్వం సాగించింది.
ఇటీవల రెడ్ బుక్ పేరు అంతగా వినిపించలేదు. కానీ విదేశాల పర్యటనకు వెళ్లిన లోకేష్ కు రెడ్ బుక్ పై ప్రశ్న ఎదురైంది. ఇక్కడ కూడ రెడ్ బుక్ గురించి అడుగుతున్నారా అంటూ లోకేష్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్ బుక్ లో ఉన్న వారిని వదిలి పెట్టేది లేదని లోకేష్ సమాధానమిచ్చారు. చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమంటూ లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. అందులో ఎలాంటి డౌట్ లేదని, మీరంతా రిలాక్స్ గా ఉండండి.. రెడ్ బుక్ పని అది చేస్తుందని లోకేష్ అన్నారు.
Also Read: TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూ మారుతోంది
ఇక రెడ్ బుక్ ఊసేలేదని అనుకుంటున్న సమయంలో మళ్లీ రెడ్ బుక్ పేరు వినిపించింది. చట్టాన్ని అతిక్రమించిన వారిని వదిలిపెట్టనని లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరన్నది ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయని మళ్లీ ఓ మారు చర్చకు దారితీసింది. ఏదిఏమైనా రెడ్ బుక్ తర్వాతి పేజీలో ఉన్నది ఎవరో తెలియాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని వదిలేది లేదు: లోకేష్
చట్టాలను ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టం
దీనిలో ఎలాంటి డౌట్ లేదు
మీరు అంతా రిలాక్స్ గా ఉండండి
– నారా లోకేష్ pic.twitter.com/niVerN9HHC
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2025