TTD News: శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ తగిన కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా బీ.ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమలలో టీటీడీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కేవలం గంట వ్యవధిలోనే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నించడం విశేషం. ఇలా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించిన టీటీడీ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తుంటారు. తిరుమల కు వచ్చిన ప్రతి భక్తుడు తిరుమలలో లడ్డు ప్రసాదాన్ని స్వీకరించినట్లుగానే, తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించడం ఆనవాయితీ. అలా భక్తులకు అందించే అన్న ప్రసాదంకు సంబంధించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూకు సంబంధించి, మరొక ఆహార పదార్థాన్ని పెంచాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. చైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా మెనూలో పలుమార్పులు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీవారి భక్తులకు ఐదువేల మసాలా వడలను టీటీడీ అధికారుల పర్యవేక్షణలో వడ్డించారు. ఈ మసాలా వడలు ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా తయారు చేయడం విశేషం.
Also Read: Chandra Gochar 2025: పంచమహాయోగం.. 5 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్న ప్రసాదం స్వీకరించిన శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహించామని, త్వరలోనే చైర్మన్ చేతుల మీదుగా మెనూలో మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపారు.