Amaravati News: రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలన గురించి కొత్త క్యాప్షన్లు ఇస్తుంటాయి. ప్రజా పాలన.. ప్రజల వద్దకు పాలన అంటూ రకరకాలుగా చెబుతుంటాయి. మరి ప్రభుత్వ సేవలు నిజంగా ప్రజల వద్దకు చేరుతున్నాయా? అందుకు ఎగ్జాంఫుల్ మొబైల్ పాస్‌పోర్టు సర్వీసు. ఇదేదో వెరైటీగా ఉంది కదూ. ఏంటి.. ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం.
ఎంత టెక్నాలజీ వచ్చినా పాస్‌పోర్టు సేవలు పొందడం సామాన్యుడికి కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రాలకు లేకుంటే ఓ మాదిరి టౌన్‌కు రావాల్సిందే. ఇకపై మారుమూల ప్రాంతాల ప్రజలు పాస్‌పోర్టు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన పని అస్సలు ఉండదు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా మొబైల్ పాస్‌పోర్టు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని వీటీజెఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొబైల్ పాస్‌పోర్టు వాహనాన్ని అందుబాటులోకి వచ్చింది. రెండు రోజుల పాటు ఆ వాహనం సేవలు అందిస్తుంది.
పాస్‌పోర్టు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ-మొబైల్ సర్వీసు వాహనం ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలను ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారుడు ఫారం నింపి, రుసుము చెల్లించవచ్చు. మొబైల్ వాహనం వచ్చే సమయానికి నేరుగా వెళ్లి సేవలను అందుకోవచ్చు. మొబైల్ వాహనంలో నలుగురు సిబ్బంది ఉంటారు.
ALSO READ: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?
రోజుకు కేవలం 40 మందికి మాత్రమే సర్వీసు అందజేస్తారు. వ్యక్తుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఆ తర్వాత బయోమెట్రిక్, ఫొటో తీసుకుని పాస్‌పోర్టుకు నమోదు చేసుకుంటారు. దీని తర్వాత పూర్తిస్థాయి పరిశీలన (వెరిఫికేషన్) ఉంటుంది. ఆ తతంగం పూర్తి కాగానే పోస్టల్ ద్వారా ఇంటికే పాస్‌పోర్టు వస్తుంది.
ఈ తరహా వాహన సేవలు ఓ మోస్తరు పట్టణానికి విస్తరిస్తే బాగుందని అంటున్నారు. పాస్‌పోర్టు అప్లై చేయాలంటే జిల్లా కేంద్రాలకు వెళ్తే ఒక రోజు పడుతుందని అంటున్నారు. ఇలాంటి సర్వీసులు మరిన్ని తీసుకొస్తే బాగుంటుందని సగటు సామాన్యుడు మాట్లాడుకోవడం కనిపించింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే కీలకమైన సేవలను ప్రజల వద్దకు తీసుకొస్తే బాగుంటుందని అంటున్నారు.
కరోనా సమయంలో ప్రజలకు టెస్టుల కోసం వాహనాలు ఉపయోగించేవారు. ఏకంగా ప్రభుత్వ సేవల కోసం వాహనాలను ఉపయోగించడం ఇప్పుడే చూస్తున్నామని అంటున్నారు. ఏమైనా ఆ తరహా సర్వీసులు బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపటి రోజుల ప్రభుత్వ సేవలు ఈ విధంగా వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్నమాట.