Mahabubabad: ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. వైద్యుల, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. సాధారణంగా చనిపోయిన వారిని మార్చురీలో పెడతారు. కానీ బతికున్న మనిషినే మార్చురీలో పెట్టి వార్తల్లోకి ఎక్కారు ఆ ఆసుపత్రి సిబ్బంది. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మనిషి బతికి ఉండగానే మార్చురీలో భద్రపరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనలో 3 రోజుల క్రితం చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన టాక్సీ డ్రైవర్ రాజు ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వచ్చాడు. పేషంట్ కు అటెండర్ లేడని, ఆధార్ కార్డు లేదని అడ్మిట్ వైద్య సిబ్బంది చేసుకొలేదు. గుర్తు తెలియని శవమని భావించిన వైద్య సిబ్బంది.. రాత్రి అంతా మార్చురీలోనే పెట్టి తాళం వేశారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా గమనించిన స్వీపర్.. వెంటనే సూపర్ వైజర్ రాజుకు సమాచారం అందించగా,అతను పోలీస్ ఔట్ పోస్ట్ లో డ్యూటిలో ఉన్న పోలీస్ కు సమాచారం ఇచ్చాడు. ఔట్ పోస్ట్ పోలీస్ ఉద్యోగి ,పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా టౌన్ ఎస్సై వచ్చి ,మార్చురీ నుండి ఆ వ్యక్తి ని బయటకు తీసుకవచ్చి AMCలో అడ్మిట్ చేయించి రికార్డులో నమోదు చేశారు పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆస్పత్రిలో మహిళ కళ్ళు తిరిగి పడిపోయిన కనీసం సిబ్బంది మానవత్వం కూడా చూపలేదని ఆరోపించారు. అడ్మిట్ రికార్డు, డేత్ రికార్డు ఇవ్వడానికి వైద్య సిబ్బంది నిరాకరిస్తున్నారని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.