AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ చివరి అంకానికి చేరింది. ఈ కేసు ముగింపుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది సిట్. దీంతో రేపో మాపో ఆయన అరెస్టు ఖాయమనే ప్రచారం మొదలైంది.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాకిచ్చారు ఏపీ పోలీసులు. లిక్కర్ కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్. ఒకవేళ విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా సిట్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా బ్రేక్ పడింది.
ఈ కేసులో ప్రమేయమున్న నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా కొందరు విదేశాలకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో పోలీసులకు చిక్కారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మిథున్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా ముందుస్తు నోటీసులు జారీ చేసింది. సిట్ అరెస్టు చేయబోయే జాబితాలో మిథున్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తీవ్రప్రయత్నాలు లేవు. బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సమయంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. 2019 తర్వాత ఏపీలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆన్లైన్ పద్దతి నుంచి మాన్యువల్ పద్దతికి మార్చారని వివరించారు. దీనివెనుక మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ALSO READ: హంద్రీనీవా ఫేజ్ 1 పూర్తి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా
ఆయన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. ఈ కేసు తుది దశకు వచ్చిందని, ఇలాంటి సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కరెక్టు కాదన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.
సిద్ధార్థ లూథ్రా వాదనలను మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్‌రెడ్డి ఖండించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు లూథ్రా వాదనలతో ఏకీభవించింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది ధర్మాసనం.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని మిథున్‌రెడ్డి భావిస్తున్నారు. ఈలోపు ఆయన్ని అరెస్టు చేయాలన్నది సిట్ ఆలోచన. ఎందుకంటే జులై మూడోవారంలో పార్లమెంటు సమావేశాలు మొదలుకానున్నాయి. దాదాపు నెలరోజులపైగా జరగనున్నాయి. ఈలోపు ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఓ ఫీలర్ బయటకువచ్చింది.