Clashes In Wanaparthy Congress: సహనశీలి, సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డికి నేతకు కోపం వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. అంత సులువుగా అసంతృప్తిని ప్రదర్శించని సదరు నేత..తన గన్ మెన్లతో పాటు ప్రభుత్వ వాహనాలు కూడా వెనక్కి ఇచ్చేశారట. పదవుల విషయంలోనే ఆయన నారాజ్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అసలు ఆయన ప్రభుత్వ పదవిలో ఉంటూ సొంత వాహనంలోనే తిరగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
వనపర్తి కాంగ్రెస్‌లో ఒకరంటే ఒకరికి పొసగని నేతలు
వనపర్తి కాంగ్రెస్ రాజకీయాలు ఆది నుంచి సమస్యల పుట్టగానే ఉంటూ వస్తున్నాయి. వనపర్తి జిల్లాలో ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువే. ముఖ్య నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదు. మొదట బహిరంగంగానే విమర్శలు చేసుకున్న సదరు కాంగ్రెస్ నేతలు..గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ వారి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమై… కలహాల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.
గన్ మెన్, ప్రభుత్వ వాహనాన్ని వెనక్కి పంపిన చిన్నారెడ్డి
వనపర్తి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి తన గన్ మెన్లను, ప్రభుత్వ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి సొంత వాహనంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు అటేండ్ అతున్నారు. గతంలోనూ గన్ మెన్లను వెనక్కి పంపిన చిన్నారెడ్డికి ఇదంతా మామూలే అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. అంత సులువుగా తన అసంతృప్తిని ప్రదర్శించని చిన్నారెడ్డి ఇలా చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎంఎల్ఎగా ప్రాతినిధ్యం వహించిన జిల్లెల చిన్నారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారింది.
చిన్నారెడ్డి స్థానంలో టికెట్ దక్కించుకుని గెలిచిన మేఘారెడ్డి
చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. చిన్నారెడ్డికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షపదవినిచ్చి ఆయన అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయినప్పటికీ ఎమ్మెల్యే మెఘారెడ్డి, చిన్నారెడ్డిల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతూ వచ్చాయి. నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఆ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నా, పవర్ పాయింట్‌గా ఎమ్మెల్యే మేఘారెడ్డి చక్రం తిప్పుతున్నారు.
వనపర్తి నియోజకవర్గంలో ఎంఎల్ఎ మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీని అన్ని తానై నడిపిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టికెట్ల పంపిణీ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. చిన్నారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం ఛైర్మన్‌గా పని చేశారు. అయితే క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా ఉన్న తనకు ఇంకా పదవీకాలం ఉండగానే మార్చారని తన అనుచరుల వద్ద ఆయన వాపోతున్నారంట.
క్రమశిక్షణ కమిటీ చైర్మన్ విషయంలో నారాజ్ అయిన చిన్నారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీని సమర్థవంతంగా నిర్వహించారనే పేరు చిన్నారెడ్డికి ఉంది. ఈ విషయంలో అధిష్టానానికి లేఖ కూడా రాసినట్లు సమాచారం. అయితే పార్టీలో కీలకమైన ఈ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా డాక్టర్ మల్లు రవిని పార్టీ నియమించింది. ఈ విషయంలో చిన్నారెడ్డి కొంత నారాజ్ అయినట్లు సమాచారం. అలాగే పార్టీ లో సంస్థాగత పదవులు చాలా కీలకంగా ఉంటాయి. ఆయనను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ నుంచి తప్పించిన తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆ క్రమంలో సంస్థాగత పదవులు కూడా దక్కడం లేదనే వాదన ఆయన వర్గం నుంచి వ్యక్తమౌతోంది.
జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించలేదని అలిగిన చిన్నారెడ్డి
వనపర్తికి చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డికి రంగారెడ్డి జిల్లా బాధ్యతలను పార్టీ అప్పగించింది. సీనియర్ నేతగా ఉన్న చిన్నారెడ్డిని మాత్రం జిల్లా బాధ్యతలు అప్పగించలేదు. ఈ పరిణామాలపై అలిగిన చిన్నారెడ్డి..తన గన్ మెన్లను, ప్రభుత్వ వాహనాన్ని వెనక్కు ఇచ్చేశారనే చర్చ జరుగుతోంది. అంతేగాక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న చిన్నారెడ్డి తన కుమారుడైన జిల్లెల ఆధిత్యారెడ్డిని వనపర్తి నియోజకవర్గంలో కీలకంగా ఉంచాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకుమారుడ్ని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Also Read: కామరెడ్డి జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. గ్రామస్థులకు నిద్ర పట్టకుండా చేస్తున్న పెద్దపులి
చిన్నారెడ్డి యత్నాలకు చెక్ పెట్టాలని చూస్తున్న వైరి వర్గం
జడ్పీ ఛైర్మన్ బరిలో ఆధిత్యరెడ్డిని దించాలని చిన్నారెడ్డి భావిస్తున్నారంట. అంతేగాక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆధిత్య రెడ్డిని పోటీకి దించాలనుకుంటున్నారట. తనయుడికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చేందుకు చిన్నారెడ్డి తాపత్రయం పడుతుంటే.. వాటన్నింటికి వైరి వర్గం చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గ్రూపు తగాదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నాయంట. ఏదేమైనప్పటికీ షరామామూలుగా వనపర్తి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు రచ్చ కెక్కుతుండటంతో… స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రభావం పడతుందని క్యాడర్ బెంబేలెత్తుతోందంట.
Story By Rami Reddy, Bigtv