Big Stories

MRO Murder Case : తహసీల్దార్ హత్యకేసు.. ప్రధాన నిందితుడు గుర్తింపు..

MRO Murder case : విశాఖ మధురవాడ కొమ్మాదిలో జరిగిన తహసీల్దార్ రమణయ్య హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడి గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు రమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. కేజీహెచ్ అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. రమణయ్య అంతిమయాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ హత్యను ఖండించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హంతకుడు ఎంతటివాడైనా ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

శుక్రవారం రాత్రి జరిగిన తహసీల్దార్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నగరం నడిబొడ్డున ఇంటికి వెళ్లి మరీ దుండగుడు తహసీల్దార్‌ను హత్య చేయడంతో విశాఖ వాసులు వెన్నులో వణుకు పుడుతోంది. ఓ కీలకమైన ప్రభుత్వ ఉద్యోగికే రక్షణ లేనప్పుడు తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హత్య జరిగింది ఏ మారుమూల ప్రాంతలో కాదు. ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ విశాఖలో. అది కూడా నిత్యం రద్దీగా ఉండే కొమ్మాదిలో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగింది. విద్యాసంస్థలు, చిన్నచిన్న వ్యాపార స్థావరాలు, అపార్ట్‌మెంట్‌లు.. ఇలా రద్దీగా ఉన్న ప్రాంతంలో తహసీల్దార్ రమణయ్య ఇంటికి దుండగుడు ధైర్యంగా వెళ్లి.. చంపి దర్జాగా తిరిగి వెళ్లిపోయాడు. ఒకటి కాదు రెండు.. కాదు ఐరన్ రాడ్డుతో అతి కిరాతకంగా హంతకుడు 7 దెబ్బలు కొట్టాడు. దీంతో అక్కడిక్కడే తహసీల్దార్ కుప్పకూలిపోయాడు.

దాడికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సుమారు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫోన్ రావడంతో తహసీల్దార్ ఫ్లాట్ నుంచి కిందకు వెళ్లారు. అక్కడ ఒకరితో 10 నిమిషాలపాటు సీరియస్ డిస్కషన్ జరిగింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో ఆ వ్యక్తి తహసీల్దార్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్ కు తరలించారు. రమణయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు.

పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ల్యాండ్ ఇష్యూ వల్ల గొడవ జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో వారిని విచారిస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం⁠ 12 బృందాలు రంగంలోకి దిగాయి.

విశాఖ జిల్లా తహసీల్దార్‌ దారుణ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. ఇద్దరు ఏసీపీలను నియమించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేసు వివరాలను సీపీ వెల్లడించారు. నిందితుడు ఎయిర్‌పోర్టు వైపు వెళ్లినట్లు గుర్తించామన్నారు. టికెట్‌ బుక్‌ చేశాడని ఆధారాలు లభించాయని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News