AP ITI Students: మీరు ఐటిఐ విద్యార్థినా? లేక ఐటిఐలో చేరాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. ఇప్పటికే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఐటిఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దగ్గరికి చేసేందుకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో జస్ట్ ఐటిఐ పూర్తి చేస్తే చాలు, వారికి ఉపాధి గ్యారంటీ అని చెప్పవచ్చు.
ఉపాధికి కొదువ లేకుండా..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది. దీనితో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే కాబోలు పలు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తుండగా, ఎన్నో సంస్థలు ఏపీ వైపు వస్తున్నాయి. విశాఖ నగరంలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. లులు, గూగుల్ సంస్థలు కూడా విశాఖ దారి పట్టగా పెట్టుబడుల ఆకర్షణలో కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.
ప్రస్తుత ఒప్పందం ఏమిటి?
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఎపి ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ నడుమ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం.
చేకూరే లాభం ఏమిటి?
ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ లను ఏర్పాటుచేస్తారు. ఈ ల్యాబ్ లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామగ్రి కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు రూ. 5కోట్లు ఖర్చుచేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది.
ఏ ఏ జిల్లాలలో..
మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు రూ.15 కోట్ల అంచనా తో మంగళగిరి లో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురం లో ష్నైడర్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా లో ష్నైడర్ ఎలక్ట్రిక్ మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్ పైలెట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.
ఏ జిల్లా ఐటిఐ విద్యార్థులకు మేలు..
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులను శిక్షణ కార్యక్రమాలపై చైతన్యవంతం చేస్తుంది. శిక్షణ కార్యక్రమాల కోసం 4 న్యాక్ సెంటర్లు (అమరావతి, కుప్పం, డిజిటల్ కమ్యూనిటీ భవన్-PM లంక, చిత్తూరు), 9 ప్రభుత్వ ఐటిఐలు (అరకు, రాజమండ్రి (బాలికలు), నర్సీపట్నం, నూజివీడు, ఒంగోలు (బాలుర), ఎ.ఎస్. పేట, కార్వేటినగరం (బాలికలు), కడప (మైనారిటీలు), శ్రీశైలం), 7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చంద్రగిరి, నంద్యాల, గన్నవరం, ఒంగోలు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
Also Read: Vizag Colony: మీ చేతిలో రూ. 500 ఉందా? ఈ టూరిస్ట్ స్పాట్ మిస్ కావద్దు
ఉపాధి ఎలా?
ఈ ఒప్పందం ద్వారా ఐటిఐ కళాశాలల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేక అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను అమర్చుతారు. దీనితో ఐటిఐ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. అలా శిక్షణ పొందిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే లోగా ఉపాధి అవకాశాలు దగ్గరికి చేర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మరెందుకు ఆలస్యం మీరు ఐటిఐ విద్యార్థి అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.