Vizag Colony: అసలే సమ్మర్ హాలిడేస్.. పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా? ఆర్థికంగా ఖర్చు అంటూ భయపడుతున్నారా? అయితే ఈ ఒక్క ప్లేస్ కు వెళ్లివచ్చారో మీరు లక్షలు ఖర్చు పెట్టినా పొందని ఆనందాన్ని పొందుతారు. ఇక్కడికి వెళ్లేందుకు మీకయ్యే ఖర్చు కూడా తక్కువే. మీ చేతిలో రూ. 500 ఉంటే చాలు, హైదరాబాద్ నుండి ఎంచక్కా, ఈ ప్రదేశానికి వెళ్లి విదేశాలకు వచ్చిన అనుభూతి పొందుతారు. ఇంతకు ఈ ప్లేస్ ఎక్కడుందని అనుకుంటున్నారా? ఆ వివరాల కోసం ఈ కథనం తప్పక చదవండి.
తెలంగాణలో ప్రకృతి సోయగం
తెలంగాణ రాష్ట్రం పర్యాటక ప్రదేశాల ఖిల్లా అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నన్ని పర్యాటక ప్రదేశాలు మరెక్కడా ఉండవు. ప్రతి గ్రామంలో ఏదొక వింతలు, విశేషాలు ఇక్కడ ఉంటాయి. అయితే ప్రకృతి ప్రేమికులను ఆదరించేందుకు ఇక్కడ ఉన్నన్నీ పర్యాటక ప్రదేశాలు ఎక్కడా లేవు. ఒక్క హైదరాబాద్ కు వస్తే చాలు, చూడదగిన ప్రదేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. అదే హైదరాబాద్ దాటితే వరంగల్, నల్గొండ, అదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా ఇలా ప్రతి జిల్లా ఎన్నో పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. అలా వీటిలో గొప్పగా చెప్పుకోదగ్గ ప్రదేశమే.. వైజాగ్ కాలనీ.
వైజాగ్ కాలనీ ఎక్కడ ఉంది?
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ ఒడ్డున ఉన్న చిన్న గ్రామం వైజాగ్ కాలనీ. ఇప్పుడు పర్యాటకుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు, యూట్యూబర్లకు ఇది కొత్త పర్యటన గమ్యస్థలంగా మారింది. అందుకే ఇక్కడికి నిత్యం పర్యాటకులు, సందర్శకులు వస్తూనే ఉంటారు.
మినీ లక్ష ద్వీపం అంటే ఇదే..
లక్ష ద్వీపానికి మీరు వెళ్లలేదా? అయితే ఇక్కడికి వెళ్లండి చాలు.. మీకు ఆ అనుభూతి కలుగుతుంది. ఇది నిజం అందుకే దీనిని తెలంగాణ మినీ లక్షద్వీపం అంటారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, చాందంపేట్ మండల పరిధిలో ఉన్న ఈ గ్రామానికి విశాఖపట్నం నుండి వలస వచ్చిన కుటుంబాల చరిత్ర ఉన్నది. ఆ సమయంలో వారు స్థాపించిన ఈ కాలనీ, ఇప్పుడు “తెలంగాణ మినీ లక్షద్వీపం”గా గుర్తింపు పొందుతోంది.
యెల్లేశ్వరగట్టు దీవి
వైజాగ్ కాలనీ సమీపంలోని యెల్లేశ్వరగట్టు దీవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీవికి బోటులో వెళ్లడం, అక్కడ క్యాంపింగ్ చేయడం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. స్థానికులు చేపల కూర, చేప ఫ్రై వంటి వంటకాలతో పర్యాటకులకి సేదతీరే అనుభవాన్ని ఇస్తున్నారు. అందుకే ఇక్కడి సీ ఫుడ్ రుచి చూసేందుకు పర్యాటకులు రోజూ రావాల్సిందే.
హైదరాబాద్ నుండి రవాణా మార్గం..
హైదరాబాద్ నుండి కేవలం 132 కి.మీ దూరంలో ఉండే ఈ గ్రామానికి రోడ్డుమార్గంలో సులభంగా చేరుకోవచ్చు. అయితే, పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ప్రాథమిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని అధికారిక పర్యాటక స్థలంగా గుర్తించి అభివృద్ధి చేస్తే, స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బూటింగ్, క్యాంపింగ్, ఫుడ్ టూరిజం వంటి అంశాల పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోంది.
Also Read: BigTV Effect: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ‘బిగ్’ టీవీ కథనంతో స్పెషల్ బస్ సౌకర్యం..
ఖర్చు తక్కువ..
సమ్మర్ ట్రిప్ తక్కువ ఖర్చుతో ముగించాలని అనుకున్నవారికి ఇదొక మంచి పర్యాటక ప్రదేశం. జేబులో రూ. 500 ఉంటే చాలు.. బస్సు రవాణా ఖర్చు, బోటింగ్ ఖర్చు పోగా భోజనం కూడా తినవచ్చు. మన దగ్గరలో ఉన్న ఇంతటి పర్యాటక ప్రదేశాన్ని మిస్ అయితే ఎలా? ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. అలా వైజాగ్ కాలనీకి వెళ్లిరండి.