Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఏపీలో అనేక చోట్ల ఫ్లెక్సీలు , బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు తొలగించడంతో వివాద రేగింది. మున్సిపల్ సిబ్బంది తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో #HBDYoungLeaderLokesh అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నారా లోకేష్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ఐటీ మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీలు, కల్పించిన ఉద్యోగాలను కోట్ చేస్తూ లోకేష్‌కు యువత అభినందనలు తెలియజేస్తోంది. దీంతో ట్విటర్ ట్రెండింగ్ లో లోకేశ్ బర్త్ డే విషెష్ హ్యాష్ ట్యాగ్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిపై నిత్యం విమర్శలు గుప్పించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం లోకేష్‌కు ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.