
Nara Lokesh : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఘోరప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టగా.. వాహనం నడిపేవ్యక్తి బండితో సహా బస్సుకింద ఇరుక్కుపోయి మృతిచెందాడు. సుమారు గంట తర్వాత మృతదేహాన్ని ప్రొక్లెయిన్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు పాలకొల్లు మండలం తిల్లపూడి వాసి, ధాన్యం వ్యాపారి అయిన కాజ శ్రీనివాసరావు (52)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీరవాసరంలో జరిగిన ఈ ప్రమాదంపై నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డికి వేలకోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ.. బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని మండిపడ్డారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు అమాయకులు బలైన ఘటన మరుకుండానే.. వీరవాసరంలో మరో ఘటన జరగడం బాధాకరమన్నారు. బస్సుకింద ఇరుక్కిపోయి చనిపోయిన వ్యక్తిని దాదాపు గంట తర్వాత బయటకు తీయడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగానే చెప్పినా.. స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని, మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వం అని విమర్శించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేయాలని, ఆర్టీసీ గ్యారేజీలలో మెయింటెనెన్స్ కు సరిపడా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.