వైజాగ్ కు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం ఏపీలో రాజకీయ రచ్చను రగిలించింది. ఏఐ డేటా సెంటర్ తో ఒప్పందం కుదరడాన్ని తమ గొప్పదనంగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంటే, అసలు దానివల్ల ఏం ఉపయోగం ఉందని వైసీపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్, ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ మధ్య సెటైర్లు మొదలయ్యాయి. ముందుగా నారా లోకేష్.. గతంలోని గుడ్డు-కోడి ఎపిసోడ్ ని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు.
గుడ్డు-కోడి..
అసలు డేటా సెంటర్ అంటే ఏంటో గత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి తెలుసా అని ప్రశ్నించారు నారా లోకేష్. అప్పట్లో ఐటీ మంత్రిని ట్రోల్ చేశారని, గుడ్డు-కోడి అంటూ విచిత్రమైన సమాధాం చెప్పి ఆయన నవ్వులపాలయ్యారని గుర్తు చేశారు. అసలు ఆయనకు ఏ అర్హత ఉందని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐటీ సంస్థ పబ్లిక్ ట్రాన్స్ పొర్టేషన్ కావాలని అడిగిందని, కనీసం ఆ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఆ పని పూర్తి చేశామని చెప్పారు నారా లోకేష్.
అమర్నాథ్ రియాక్షన్..
గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని ప్రతిపక్ష వైసీపీ స్వాగతించలేదు సరికదా, దానివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందంటూ వైసీపీ అనుకూల మీడియా కొత్త విమర్శలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో గత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈ డేటా సెంటర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దానివల్ల కేవలం 200 ఉద్యోగ అవకాశాలు మాత్రమే వస్తాయని అన్నారు అమర్నాథ్. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు లక్షా 80వేల ఉద్యోగ అవకాశాలు అనేవి కేవలం కల్పితం అని విమర్శించారు. ఆ మాట గూగుల్ కంపెనీతో చెప్పించగలరా అని నిలదీశారు. గూగుల్ తో ఒక ప్రెస్ నోట్ విడుదల చేయించాలని సవాల్ విసిరారు గుడివాడ.
LIVE: Anakapalli District President & Former Minister Sri Gudivada Amarnath Press Meet https://t.co/4vQPoOwF30
— YSR Congress Party (@YSRCParty) October 17, 2025
Also Read: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్
అలా సాధ్యమవుతుందా?
గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్ కి ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి..? ఉద్యోగులు అంటే.. డేటా సెంటర్ లో కుర్చీలో కూర్చుని పనిచేసేవాళ్లేనా, దానివల్ల వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకునేవారిని కూడా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వచ్చినవారిగా పరిగణించాలా? కూటమి ప్రభుత్వం విశాల అర్థం చెప్పింది. గూగుల్ డేటా సెంటర్ వల్ల కలిగే ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను లెక్కగట్టి లక్షా 80వేలుగా తేల్చింది. ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ కేవలం 200 ఉద్యోగులు మాత్రమే ఆ డేటా సెంటర్ లో పనిచేస్తారని చెప్పారు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు కూడా ఉద్యోగాల కల్పనలో ఇలాంటి లెక్కలే చెప్పారా అని నిలదీస్తున్నారు నెటిజన్లు. ప్రభుత్వం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్ని పోస్ట్ లు భర్తీ అవుతాయనే లెక్క స్పష్టంగా ఉంటుంది. ఒక చోట కంపెనీ పెడుతున్నారంటే, దాని వల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే విషయంపై రమారమి అంచనా ఉంటుంది. ఈ విషయం తెలియ కాదు, ఉద్దేశపూర్వకంగానే అమర్నాథ్ విమర్శలు ఎక్కుపెట్టారని అంటున్నారు కూటమి నేతలు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్ తో చెప్పించాలని అనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అని చెబుతున్నారు. వైజాగ్ కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని తీసుకు రావడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ కావడంతో వైసీపీ ఇరుకున పడినట్టు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు, పవన్ గురించి కర్నూలు సభలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు