Fatty Liver: ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రస్తుతం అనేక మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉదయం పూట లైఫ్ స్టైల్‌లో కొన్ని రకాల మార్పులు చేసుకోడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 5 ముఖ్యమైన మార్పులు, ఫ్యాటీ లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సరైన ఆహారం, శారీరక శ్రమ, మంచి అలవాట్ల వంటివి కూడా కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడటానికి ఎలాంటి టిప్స్ పాటించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయాన్నే నిమ్మరసంతో గోరువెచ్చని నీరు తాగడం:
ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మ రసాన్ని కలిపి తాగడం చాలా మంచిది. దీనికి చక్కెర లేదా తేనె కలపకుండా తాగితే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యకు తోడ్పడే పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, తద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తుంది. ఈ అలవాటు కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది.
2. 15-20 నిమిషాలు వ్యాయామం లేదా యోగా:
ఉదయం లేచిన వెంటనే సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఫ్యాట్ లివర్ సమస్య తగ్గుతుంది. ఇదిలా ఉంటే.. వ్యాయామం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇది శరీర బరువును తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. ఉదయం పూట చురుకుగా ఉండటం ఆ రోజు మొత్తానికి ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తుంది. అందుకే యోగా లేదా వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి.
3. కాలేయానికి అనుకూలమైన బ్రేక్ ఫాస్ట్ :
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఫ్యాటీ లివర్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యానికి తోడ్పడే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం తప్పనిసరి. పీచు పదార్థాలు , యాంటీ ఆక్సిడెంట్లు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, చియా సీడ్స్, బెర్రీలు, నట్స్ కలిపిన ఓట్స్ వంటివి మంచివి. చక్కెర ఎక్కువగా ఉన్న ధాన్యాలు ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే అవి కాలేయంపై భారం పెంచుతాయి.
4. కాఫీ లేదా గ్రీన్ టీని చేర్చడం:
ఉదయం కాఫీ లేదా గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే.. దానికి చక్కెర లేదా పాలు లేకుండా బ్లాక్ కాఫీ లేదా ప్లెయిన్ గ్రీన్ టీని ఎంచుకోవాలి. ఇది కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగు పరచడంలో అంతే కాకుండా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Also Read: ఈ 4 వ్యాధులు కంటికి హాని కలిగిస్తాయ్ ! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
5. పచ్చి కూరగాయల రసం తాగడం:
మీ మార్నింగ్ రొటీన్‌లో ఒక గ్లాసు పచ్చి కూరగాయల జ్యూస్ చేర్చుకోవడం ద్వారా కాలేయ శుద్ధికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా బీట్‌రూట్ , క్యారెట్ , పాలకూర వంటి వాటితో తయారు చేసిన జ్యూస్‌లు కాలేయాన్ని శుభ్రపరిచే పోషకాలను, యాంటీఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటాయి. ఈ జ్యూస్‌లలో కొద్దిగా అల్లం కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాలేయ కణాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కొవ్వును తగ్గించడానికి దోహద పడుతుంది. ఈ జ్యూస్ నిమ్మరసం తాగిన 30 నిమిషాల తర్వాత తీసుకోవడం ఉత్తమం.