Nims Medico Death: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం రాత్రి విధులకు హాజరైన నితిన్, శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన వైద్య విద్యార్థులు నితిన్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే నిమ్స్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు సమాచారం అందించారు.
నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ అయిన నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నితిన్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వైద్య విద్యార్థి మృతికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే నితిన్ మృతిపై అతడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నితిన్ తల్లిదండ్రులు ఆరోపించారు. నితిన్ తల్లిదండ్రులు, బంధువులు నిమ్స్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అసలు జరిగిన వాస్తవమేంటో బయటపెట్టాలని జూనియర్ డాక్టర్లు, నితిన్ స్నేహితులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సొంత జిల్లాకు చెందిన విద్యార్థి మృతిపై వెంటనే స్పందించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నితిన్ మృతికి కారణాలు తెలపాలని కోరుతున్నారు.