Vizag News: మంత్రి లోకేష్ పదే పదే చెబుతున్నారు. పదేళ్లలో హైదరాబాద్‌ను విశాఖ నగరం దాటేస్తోందని వీలు చిక్కినప్పుడల్లా చెబుతున్నారు. గూగుల్ కంపెనీ విశాఖ రాకతో మిగతా కంపెనీలు, నిర్మాణ సంస్థల దృష్టి సాగరతీరంపై పడింది. తాజాగా రహేజా గ్రూపు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
విశాఖపై కంపెనీల దృష్టి
విశాఖ సిటీకి గూగుల్ సంస్థ రాకతో మిగతా కంపెనీలు, నిర్మాణ సంస్థల దృష్టి అటువైపు పడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి రానుంది. విశాఖలో ప్రముఖ నిర్మాణ సంస్థ రహేజా కార్పొరేషన్ పెట్టుబడులు పెట్టనుంది. ఐటీ కంపెనీలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలను నిర్మించడానికి సిద్ధమైంది. ఇందుకోసం రూ.2,172 కోట్లు పెట్టుబడి పెట్టాలని డిసైడ్ అయ్యింది.
మధురవాడ ఐటీ హిల్‌లో భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు కోసం 27 ఎకరాలు ఇవ్వాలని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని రహేజా సంస్థ తన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రధాన ఐటీ కంపెనీలకు విశాఖలో ప్రభుత్వం భూములు కేటాయించింది. మరికొన్ని ఐటీ కంపెనీల దృష్టి అటు వైపు పడింది. ఆయా సంస్థలకు ఆఫీస్ స్పేస్ అవసరం కానుంది.
విశాఖలో రహేజా సంస్థ పెట్టుబడులు?
కొత్తగా రాబోయే ఐటీ కంపెనీల అవసరాల కోసం ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది రహేజా సంస్థ. ముఖ్యంగా కమర్షియల్ భవనాలను 2028 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక ఉద్యోగుల నివాస భవనాల ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయనున్నట్లు సంస్థ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు అందులో ప్రతిపాదన చేసింది. వీటి ద్వారా రూ.663.42 కోట్లు ఖర్చు చేయనుంది.
తద్వారా 9.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. ఇక రెండో దశ విషయానికి వద్దాం. రెండో దశలో నిర్మించే వాణిజ్య భవనాలను 2031 నాటికి పూర్తి చేయనుంది. 2035 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలన్నది ఓ ఆలోచన. అందుకోసం రూ.1,418 కోట్లు ఖర్చు చేయనుంది. రహేజా సంస్థ తన ప్రణాళికలను రెండు దశలుగా విభజించింది.
ALSO READ: మంత్రి నారాయణ కామెంట్స్.. రియాక్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వర్మ
ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 9,500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. రహేజా సంస్థ రెండు దశల్లో చేపట్టనున్న ప్రాజెక్టు ద్వారా సుమారు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు వస్తే మధురవాడ ప్రాంతం ఐటీ-స్టార్టప్‌లకు కేంద్రంగా మారనుంది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ కింద రాయితీ ధరకు భూములు ఇవ్వాలని రహేజా సంస్థ కోరింది.
కేటాయించే భూములకు 18 మీటర్ల వెడల్పు రోడ్డు అనుసంధానం అయ్యేలా ఉండాలని అభ్యర్థించింది. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ కింద ఐటీ క్యాంపస్ డెవలపర్‌లకు ఇచ్చే ప్రోత్సాహకాలు తమకు ఇవ్వాలని కోరింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం మిలీనియం టవర్ 1, 2 లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్పేస్‌ను టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలకు కేటాయించింది.