Big Stories

Nara Lokesh : యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర.. టార్గెట్ ఎన్ని మైళ్లు అంటే..?..

Nara Lokesh : ఏపీలో ఎన్నికలకు మరో 16 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ రాజకీయ కార్యకలాపాల్లో స్పీడ్ పెంచుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇటు ప్రతిపక్ష టీడీపీ ..జగన్ సర్కార్ ను గద్దె దించాలన్న పట్టుదలతో ఉంది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటు చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

- Advertisement -

యువగళం..
జనవరి 27న నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుడతారు. కుప్పం నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. 400 రోజులపాటు పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 4 వేల కిలోమీటర్లు నడవాలని సంకల్పం పెట్టుకున్నారు. అంటే దాదాపు 13 నెలలపాటు లోకేశ్ పాదయాత్ర సాగుతుంది. 2024 మార్చి మొదటివారం వరకు ఈ యాత్ర సాగే అవకాశం ఉంది. అప్పటికి ఎన్నికలకు మరో నెలరోజుల మాత్రమే సమయం ఉంటుంది. ఇలా ఎన్నికల ముందు వరకు పాదయాత్ర సాగేటట్టు లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ఏడాదిపైగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైతే తనకు మంచి ఇమేజ్ ..పార్టీకి మైలేజ్ వస్తుందని లోకేష్ భావిస్తున్నారు.

- Advertisement -

మళ్లీ మంగళగిరి నుంచే పోటీ
మంగళగిరి నియోజకవర్గంలో 4 రోజులుపాటు పాదయాత్ర చేస్తానని లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇక్కడ నుంచే తిరిగి పోటీ చేస్తానని ఆ సమయంలోనే వెల్లడించారు. ఇప్పటికే ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉండేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల బాగోగులు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. కేసులకు భయపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే కార్యకర్తలు అంత బాగా పనిచేసినట్లు అని గతంలో లోకేశ్ చెప్పడం రాజకీయ దుమారం రేపింది. తనపై ఎన్ని ట్రోలింగ్ లు జరుగుతున్నా తగ్గేది లేదని ముందుకుసాగుతున్నారు లోకేశ్.

కార్యకర్తల్లో జోష్..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా లోకేష్ పాదయాత్ర సాగనుంది. రాయలసీమలో మొదలయ్యే పాదయాత్ర ఉత్తరాంధ్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ముగించే అవకాశం ఉంది. సాధ్యమైన ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వస్తోందని పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి తిరిగి బలం చేకూరుతుందని అంచనా వేస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ…టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరించనున్నారు.

సెంటిమెంట్ ఫలిస్తుందా?
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ పాదయాత్రలు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పేరుతో 68 రోజులపాటు 56 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు. మొత్తం 1475 కిలోమీటర్ల నడిచారు. చంద్రబాబు వస్తున్నా మీ కోసం పేరుతో 2014 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేశారు. చంద్రబాబు 2,817 కిలోమీటర్లు నడిచి వైఎస్ఆర్ రికార్డును బ్రేక్ చేశారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు నడిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ముగ్గురు నేతల పాదయాత్రలు పొలిటికల్ గా సూపర్ హిట్ అయ్యాయి. మరి లోకేష్ ఇప్పుడు 4 వేల కిలోమీటర్లు నడిచి జగన్ రికార్డును బ్రేక్ చేయాలని సంకల్పించారు. 4 వేల కి.మీ. టార్గెట్ అయితే రీచ్ కావడం ఖాయమే. అయితే టీడీపీకి అధికారం దక్కుతుందా? సెంటిమెంట్ సూత్రం ఫలిస్తుందా? చూడాలి మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News