ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ ఆసుపత్రికి చేరుకోగా తాజాగా సీఎం చంద్రబాబు సైతం ఆస్పత్రికి వచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువెళ్లనున్నారు. అక్కడి నుండి నారావారిపల్లికి తరలిస్తారు. ఇదిలా ఉండగా రామ్మూర్తి నాయుడు గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చేర్పించగా మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1994 నుండి 1999 వరకు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఆయనకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామ్మూర్తి నాయుడు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో నాటకాలపై ఉన్న ఆసక్తితో స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గా పనిచేశారు. అనంతరం చంద్రబాబుకు రాజకీయాల్లో అండగా ఉండేవారు. 1992లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అకస్మాత్ముగా ఆయన చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.