మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి క్వారీ కేసులో అరెస్ట్ భయంతో పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. నెల్లూరులో ఆయన ఇంటి వద్ద పోలీసులు రెండు గంటల సేపు వేచి చూసినా ఆయన గురించి సమాచారం ఎవరూ చెప్పలేదు. చివరకు ఆయన ఇంటి గేటుకి పోలీసులు నోటీసులు అంటించి వచ్చారు. ఆ నోటీసుల తర్వాత కాకాణి మరో డ్రామా ప్లే చేశారు. తానెక్కడికీ పారిపోలేదని నిరూపించుకోడానికి ఉగాది సెలబ్రేషన్స్ అంటూ కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. తన మనవడికి ఉగాది పచ్చడి తినిపిస్తున్న కాకాణి అంటూ ఆ ఫొటోలకు రైటప్ వేశారు. దీంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తెలిసింది. ఆయన కోసం నెల్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. ఖాకీలు తనని తరుముకొస్తున్నారనే విషయం తెలియగానే ఆయన అక్కడినుంచి మకాం మార్చారు.
హైదరాబాద్ లో కాకాణి, ఆయన బంధువులకు చెందిన మూడు ఇళ్లకు వెళ్లారు పోలీసులు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ లేదు. దీంతో బంధువులకి నోటీసులిచ్చారు. ఏప్రిల్-1 వతేదీ ఉదయం నెల్లూరులో పోలీస్ విచారణకు రావాలని అందులో సమాచారమిచ్చారు. ఏప్రిల్-1 న విచారణకు రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాకాణి ఎక్కడ..?
మాజీ మంత్రి కాకాణిపై గతంలో కూడా పోలీస్ కేసులున్నాయి. కానీ ఈసారి అక్రమంగా క్వార్ట్జ్ తరలించడం, మైనింగ్ ప్రాంతాల్లో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి కేసులు పెట్టారు. దీంతో ఆయన తప్పించుకునే వీలు లేకుండా పోయింది. మామూలుగా అయితే అరెస్ట్ లకు భయపడేది లేదంటూ ఆయన గంభీరంగా డైలాగులు చెప్పేవారు. కానీ అలాంటి కాకాణే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. వరుస సెలవలు వస్తుండే సరికి కనీసం బెయిల్ కూడా దొరికే ఛాన్స్ లేదని ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం వెదికి వెదికి పోలీసులకు విసుగొచ్చింది.
నెల్లూరు, హైదరాబాద్.. ఇలా కాకాణి పలు చోట్ల అడ్రస్ లు మారుస్తున్నారు. రెండు రోజుల ముందు కాకాణి ఇంటికి వైసీపీ స్థానిక నేతలు పరామర్శల యాత్రలు చేపట్టారు. ఆయన్ను అరెస్ట్ చేస్తారని వార్తల నేపథ్యంలో అందరూ వచ్చి మద్దతు తెలిపారు. కాకాణి కూడా అరెస్ట్ లకు తగ్గేది లేదంటూ రెండు రోజుల ముందు స్టేట్ మెంట్లిచ్చారు. కానీ సడన్ గా ఆయన నెల్లూరు వదిలి వెళ్లిపోయారు. చివరకు హైదరాబాద్ లో కూడా లేకుండా పోలీసుల నుంచి తప్పించుకున్నారు.
రేపటి వరకు డెడ్ లైన్
కాకాణికి రేపటి వరకు డెడ్ లైన్ ఉంది. రేపు ఉదయం 11 గంటలకల్లా నెల్లూరు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఒక నోటీసుకి కాకాణి స్పందించలేదు, తాజా నోటీసుకయినా ఆయన సమాధానం ఇస్తారా, లేక నేరుగా లాయర్ తో కలసి పోలీస్ స్టేషన్ కి వస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ నోటీసుని కూడా ఆయన లెక్క చేయకపోతే పోలీసుల రియాక్షన్ ఏంటనేది తేలాల్సి ఉంది.