ఎక్కడ ఏ పర్యటనకు వెళ్లినా మందీ మార్బలంతో రోడ్ షో చేయడం జగన్ కి అలవాటు. ఆయన అనుచరులు కూడా దానికి తగ్గట్టే ప్లాన్ చేస్తుంటారు. కానీ నెల్లూరు పర్యటనలో జగన్ కి ఆ ఛాన్స్ లేకుండా చేశారు పోలీసులు. జగన్ హెలికాప్టర్ లో వస్తారని, హెలిప్యాడ్ కోసం స్థలం కావాలంటూ ఇటీవల పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు. అయితే వారు కావాలని కోరిన హెలిప్యాడ్ స్థలాలన్నీ నెల్లూరు నగరానికి దగ్గర్లో ఉన్నాయి. అంటే నగరానికి దగ్గర్లో జగన్ హెలికాప్టర్ దిగి, నగరంలో ర్యాలీ చేసి, నగరానికి దూరంగా ఉన్న జైలుకి వెళ్లి మాజీ మంత్రి కాకాణిని పరామర్శిస్తారనమాట. అయితే ఈ ర్యాలీకి పోలీసులు చెక్ పెట్టారు. హెలిప్యాడ్ కోసం జైలు వెనక ఉన్న అటవీ ప్రాంతాన్ని వాడుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. దీంతో వారు షాకయ్యారు. జైలు వెనక జగన్ హెలికాప్టర్లో దిగి జైలులోకి వెళ్లి కాకాణిని పరామర్శించి వస్తే ఆ పర్యటనకు అర్థమేముంటుంది, జనాన్ని ఎలా తరలించాలి, ఆ కార్యక్రమాన్ని ఎలా హైలైట్ చేయాలంటూ స్థానిక నేతలు తలలు పట్టుకున్నారు.
ఇటీవల కాలంలో జగన్ పర్యటనలు ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా సత్తెనపల్లి పర్యటనలో వివిధ కారణాలతో ముగ్గురు చనిపోయారు. ఒక వ్యక్తి మరణానికి సంతాపం ప్రకటించడానికి, అది కూడా ఏడాది తర్వాత వెళ్లిన జగన్, మరో ముగ్గురు చావుకి కారణం అయ్యారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన పర్యటనలపై నిషేధం విధించాలంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా జగన్ నెల్లూరు వస్తున్నది కేవలం జైలులో ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించడానికే. అలాంటప్పుడు ఆయన నగరంలో దిగి, అక్కడ్నుంచి జైలుకు వెళ్లడం దేనికి, నేరుగా జైలు పక్కనే హెలికాప్టర్లో దిగి వెళ్లొచ్చుకదా అని పోలీసులు అంటున్నారు. అయితే జైలుపక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తే తమకు మైలేజీ రాదని, ప్రజల్లోకి వెళ్లి బలప్రదర్శన చేస్తేనే వైసీపీ ఉనికి నిరూపించుకున్నట్టు అవుతుందని ఆలోచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చివరకు జగన్ పర్యటన ఏమవుతుందో చూడాలి.
జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి, టీడీపీ అధైర్యపడుతోందని, ఆయన పర్యటనలను అడ్డుకోవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కావాలనే జగన్ హడావిడి సృష్టిస్తున్నారని, పర్యటనల పేరుతో జన సమీకరణ చేసి రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. జగన్ సత్తెనపల్లి వెళ్లకుండా ఉంటే ముగ్గురు మనుషులు ప్రాణాలతో ఉండేవారు. ఆయన టూర్ ముగ్గుర్ని బలితీసుకుందని సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఈసారి నెల్లూరులో అలాంటి పొరపాట్లు లేకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ర్యాలీలకు అవకాశం లేకుండా జైలు పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అందుకే హెలిప్యాడ్ విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ వైసీపీ విమర్శలు మొదలు పెట్టింది.