
Anakapalli : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముగ్గురు బుకీలను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి మండలం కొండ కొప్పాక గ్రామంలోని ఒక ఇంట్లో రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టైన వారిలో అనకాపల్లి గవరపాలెంకు చెందిన ఎల్లపు చక్రవర్తి , కాండ్రేగుల జగన్ , పెంటకోట మహేష్ చిన్నాలు ఉన్నారు. వారి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, ఒక లాప్ టాప్, ఒక టీవీ, 11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో బెట్టింగ్ ముఠా వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న కేసు కలకలం సృష్టించింది. ఆ కేసులో కూడా ఎల్లపు చక్రవర్తి అనే వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడు. అదే వృత్తిని కొనసాగిస్తూ మళ్ళీ దొరకాడు.
అనకాపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. గతంలో కొంతమందిపై బెట్టింగ్ కేసులు ఉన్నప్పటికీ వారిపై పోలీస్ నిఘా లేకపోవటంతో విచ్చల విడిగా బెట్టింగ్ జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల చర్యలు నామమాత్రంగా ఉండటంతో బెట్టింగ్ ముఠా ఆగడాలకు హద్దు లేకుండా పోయిందంటున్నారు. బెట్టింగ్ బారినపడి అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.