Pawan on Pulivendula: పులివెందుల-ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాల గురించి నోరు విప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఉప ఎన్నికల్లో గెలిచిన విజేతలకు అభినందనలు చెప్పారు. పులివెందుల-ఒంటిమిట్టల్లో ప్రజాస్వామ్యయుత పోటీ ద్వారా అసలైన ప్రజా తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆయన రాసుకొచ్చారు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పులివెందుల జెడ్పీ కోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన కూటమి, అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. చివరకు వైసీపీ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. టీడీపీ సాధించిన గెలుపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో మాట్లాడారు.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన టీడీపీ అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్ వేయకుండా చేశారన్నారు. ఒకవేళ నామినేషన్ వేయాలని భావించినవారిపై దాడులు లేదంటే బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉందని, ఏకపక్షంగా సాగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చన్నారు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి కచ్చితమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటివరకు ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా వైసీపీ చేసుకుంటూ వచ్చిందన్నారు.
ALSO READ: ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్ని రెండు బస్సులు, ముగ్గురు మృతి
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పోటీకి ఆస్కారం కలిగిందన్నారు. మూడు దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చినవారికి ఓటు వేశామని పులివెందుల ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రమంతా అర్థం చేసుకుంటోందన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట బైపోల్‌లో నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సాగిందని, అభ్యర్థులు ప్రచారాలు చేసుకొన్నారని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణ కారణంగా స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడిందన్నారు. ఈ ప్రక్రియ ఇష్టం లేని ప్రత్యర్థులు.. ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగిందన్నారు.
ఎన్నికలు జరగడం ఇష్టంలేక అసహనంతో ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారని గుర్తు చేశారు. పోలింగ్ సందర్భంలో హింసకు తావు లేకుండా చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఫలితాలు మధ్యాహ్నాం నాటికి వెలువడ్డాయి. టీడీపీ నేతలు, సీఎం చంద్రబాబు స్పందించారు. కాకపోతే కూటమి నుంచి డిప్యూటీ సీఎం పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కూటమి మధ్య లుకలుకలు మొదలయ్యాయంటూ వైసీపీ ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. ఆలస్యంగా స్పందించినా, వైసీపీ చేసిన అరాచకాలను ఎత్తి చూపారాయన.