Peela Srinivas Rao: నాలుగు దశాబ్దాల తరువాత గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ మీద ఎట్టకేలకు టీడీపీ జెండా ఎగిరింది. దాంతో సుదీర్ఘకాలం తర్వా టీడీపీ కల నెరవేరినట్టైంది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముందు నుంచి పట్టుకున్న టీడీపీకి ఇంతకాలం మేయర్ పీఠం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. ఆ క్రమంలో నెల రోజులుగా మేయర్ సీటుపై కొనసాగుతున్న పొలిటికల్ హీట్ అవిశ్వాసంలో కూటమి పార్టీ గెలుపుతో ముగిసినట్లైంది. కూటమి పార్టీల వ్యూహాలు ఫలిచడంతో.. ఉమ్మడి జిల్లాలో వైసీపీ మరింత ప్రాభవం కొల్పోయినట్లైంది. ఈ విజయం వెనుక కూటమి పార్టీల వ్యూహాత్మక ప్రణాళికలు ఫలించాయి. వైసీపీలోని అంతర్గత కలహాలే ఆ పార్టీ కొంప ముంచాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
1987లో తొలిసారి టీడీపీ తరఫున మేయర్ గా డీవీ సుబ్బారావు
విశాఖపట్నం కార్పోరేషన్ 46 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. 1987లో తొలిసారి టీడీపీ తరఫున మేయర్ గా డీవీ సుబ్బారావు గెలిచారు. 2005లో గాజువాక మున్సిపాలిటి, 32 గ్రామపంచాయతీలు విలీనంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతిరించింది. 1987 తర్వాత ఇప్పటి వరకూ మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి రాలేదు. 2007లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కార్పోరేషన్‌లో అతి పెద్ద పార్టీగా నిలిచినా.. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఇండిపెండెట్ల మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అవ్వడంతో.. కాంగ్రెస్ మేయర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కార్పొరేషన్ ఎన్నికలు జరిపించలేదు.
మేయర్‌గా 11వ డివిజన్ కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి
అ తర్వాత 2019లో ఓటమితో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 23 సీట్లకే పరిమితమైన విశాఖలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సెగ్మెంట్లో గెలిచి సత్తా చాటుకుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి మేయర్ పీఠాన్ని దక్కించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 డివిజన్లకు గాను వైసీపీ 58 డివిజన్లు గెలుచుకుంది. దీంతో 11వ డివిజన్ కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి మేయర్ పీఠంపై కూర్చున్నారు. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఒకరు కూడా వైసీపీలో చేరారు.
టీడీపీ, జనసేనల బాట పట్టిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో, 9 మంది జనసేనలోకి వెళ్లారు. అలాగే ఇండిపెండెంట్‌లు కూడా టీడీపీ, జనసేన పార్టీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ 58 మంది కార్పొరేటర్ల సంతకాలు చేసి గత నెల 21న జీవీఎంసీ ఇన్‌చార్జ్, కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు.
పార్టీ మారిన వారికి భారీ నజరానాలు ఆఫర్ చేసిన వైసీపీ
తాజాగా విశ్వాస తీర్మానం కోసం ప్రత్యేకంగా కౌన్సిల్ మీటింగును ఏర్పాటు చేశారు. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం. నెగ్గకుండా కూటమికి ఝలక్ ఇవ్వడానికి వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తమ వైపుకు లాక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా వారికి భారీగా నజరానాలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు అంతా కూడా మలేషియాలోనే ఉన్నారు. అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన వైసీపీ సభ్యులు
కౌన్సిల్ సమావేశానికి ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా.. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అయితే ముందున్న 74 మెజార్టీలో ఆఖరి నిమిషంలో ఒకరు జారుకోవడంతో కూటమి నేతల్లో ఆందోళన చోటు చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు, 6వ డివిజన్ కార్పొరేటర్ ప్రియాంక చేరికతో విజయం సొంతమైంది. 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యుల ఓటింగ్‌తో కూటమి విజయం సాధించింది.
గత నెల రోజులుగా విశాఖ కార్పోరేషన్లో పొలిటికల్ హీట్
ముందు నుంచి చెబుతున్నట్లుగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు విజయం సాధించాయి. నెల రోజులుగా విశాఖ మేయర్ స్థానానికి సంబంధించి కొనసాగుతున్న పొలిటికల్ హీట్ అవిశ్వాసంలో గెలుపుతో ముగిసినట్లైంది. ఇందులో కూటమి పార్టీల వ్యూహాలు ఫలిచడంతో పాటు.. వైసీపీలోని అంతర్గత కలహాలు వారి పరాజయానికి కారణమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసలు సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత విశాఖ మేయర్ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ద్వారా…మరింత పట్టు తెచ్చుకునేందుకు పావులు కదిపాయి. మేయర్ పదవీ కాలం నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకూ వ్యూహాత్మకంగా అడుగులు వేసిన మిత్రపక్షాలు.. నాలుగేళ్లు పూర్తి కాగానే మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం
మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టకముందు నుంచే వైసీపీ నుంచి కార్పొరేటర్లను.. తమవైపు తిప్పుకోవడానికి కూటమి నాయకులు పకడ్బందీగా పావులు కదిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన కూటమి పార్టీలు.. జీవీఎంసీలోని వైసీపీ కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా తమ పార్టీల్లో చేర్చుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టగానే కార్పొరేటర్లు చేయి జారిపోకుండా పకడ్బందీగా వ్యూహారచన చేసి… విదేశీ క్యాంపులకు తరలించడం.. ఓటింగ్ సమయానికి కోరం ఉండేలా ప్లాన్ చేసుకుని అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. 2024 ఎన్నికల ఓటిమితో డీలా పడ్డా వైసీపీకి.. జీవీఎంసీ మేయర్ పీఠం కొల్పోవడం పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు.
మేయర్ పీఠం కోల్పోవడంతో జనంలోకి వైసీపీ నేతలు
ఇప్పటికే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదుర్కొంటోంది. తమ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతోనే మేయర్ పీఠం కొల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు అంటుండటం గమనార్హం. వైసీపీ కార్పొరేటర్లలో అసంతృప్తి, చేయి జారిపోతున్న కార్పొరేటర్లను నిలువరించడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ నేతల్లో అంతర్గత విభేదాలు, నాయకత్వ వైఫల్యం కార్పొరేటర్లను పార్టీ నుంచి దూరం చేశాయనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నేతలు రాజీనామా చేయడం.. పార్టీ బలహీనపడటం మేయర్ పీఠం కొల్పోవడానికి రీజన్‌గా చెబుతున్నారు.
వైసీపీ వ్యూహాలను తిప్పికోట్టిన కూటమి
జీవీఎంసీ మేయర్ పీఠం తమ చేతల్లో నుండి కూటమి చేతుల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళ్లాలనే ప్లాన్‌లో ఉంది వైసీపీ. రానున్న తొమ్మిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు ఆందోళనలు చేస్తూ జీవీఎంసీ ఎన్నికలకు సిద్ధం అవ్వడానికి వైసిపి ప్లాన్ చేస్తుందట. కూటమి పాఅప్రజాస్వామికంగా తమ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి.. మేయర్ పీఠం కైవసం చేసుకుందని జనంలోకి వెళ్లడానికి సిద్దమవుతుంది. వైసీపీ వ్యూహాలను తిప్పికోట్టేందుకు కూటమి పార్టీల నేతలు కూడా వ్యూహారచన చేశారట. ప్రజాక్షేత్రంలో వస్తే.. ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారనే ధీమాతో ఉన్నారట కూటమి నేతలు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విశాఖలో జరిగిన భూ దోపిడి, అక్రమాలు, ఆరచకాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని అందుకే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారంటున్నారు. తమ ఆధ్వర్యంలోనే గ్రేటర్ విశాఖ మరింత అభివృద్ధి చెందబోతుందని కూటమి నేతలు చెబుతున్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని మేయర్ హోదాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నుంచి మేయర్ గా పీలా శ్రీనివాసరావు
మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత కూటమి నుంచి 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ పేరు మేయర్‌గా దాదాపు ఖరారైంది. పీలా శ్రీనివాసరావు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్‌కు అన్న. గతంలో విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పీలా శ్రీనివాస్ పనిచేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. తొలి నుంచి మేయర్ రేసులో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఆర్ధికంగా బలమైన నాయకుడు కావడం, క్యాంపులను వెనక ఉండి చూసుకుంది కూడా పీలా శ్రీనివాసరావే అనే చర్చ జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా పీలా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపిస్తోందంట. మొత్తమ్మీద విశాఖ కౌన్సిల్లో తగిలిన షాక్‌తో వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి కూటమి పార్టీల బాట పట్టడం ఖాయమంటున్నారు.