Penamaluru TDP Politics | కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి మారిపోతోంది. పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి జోగి రమేశ్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి మారిపోతోంది. పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి జోగి రమేశ్‌ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయన టీడీపీలో చేరడం ఖాయమవ్వడంతో పెనమలూరు టీడీపీ టికెట్ ఆ మాజీమంత్రికే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది . అదే జరిగితే అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిస్థితి ఏంటి? పార్టీ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారా?
కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నేత పార్థసారథిని కాదని మంత్రి జోగు రమేష్‌ను వైసీపీ పెనమలూరు ఇన్‌చార్జ్‌గా ప్రకటించడంతో పార్థసారథి టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోకేశ్ ను పార్థసారథి రెండు సార్లు కలిశారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 21న ఆయన పసుపు కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైందంట.
మరోవైపు పెనమలూరు టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు టీడీపీ హైకమాండ్ నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టింది. గద్దె రామ్మోహన్ తో టీడీపీ అధిష్టానం రాయబారం నడుపుతోంది. బోడే ప్రసాద్ తో భేటీ అయిన గద్దె… బోడె ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుకు హై కమాండ్ భరోసా ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఆ బుజ్జగింపులు ఇంకా కొలిక్కి రాలేదంట. కొలుసు పార్థసారథిపై బోడే ప్రసాద్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. టిడిపి కష్టకాలంలో ఉన్న సమయంలో సేవలు కొనసాగించిన తమ అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా పార్థసారథికి టికెట్ ఇస్తే ఓడించడానికి కృషి చేయడానికి బోడే వర్గం సిద్ధంగా ఉందంటున్నారు.
ఆ క్రమంలో పెనుమలూరు నుంచి తానే స్వయంగా పోటీకి దిగుతానని బోడే ప్రసాద్ చెబుతున్నారు. నియోజకవర్గంలోని టిడిపి నేతలు, పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంలో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా బోడ ప్రసాద్‌నే సమర్థిస్తున్నారు. తాజాగా పార్టీ శ్రేణులతో సమావేశమైన బోడె ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తనకు తోడుగా ఉంటే తగ్గేదే లేదని చెప్పుకొచ్చారు. పార్థసారధి వల్ల తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని బోడ ప్రసాద్ ఆందోళనలో ఉండడం వల్లే ఆ సమ్మేళనం నిర్వహించారని వినిపిస్తోంది.
ఆ క్రమంలో పెనమలూరు టిడీపీ శ్రేణులు బోడె ప్రసాద్‌కు మద్దతుగా ఆందోళనలకు దిగుతున్నాయి. గత ఎన్నికల్లో పార్థసారథి చేతిలో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం తమ నేతకే టికెట్ ఇవ్వాలని ఆందోళను షురూ చేసింది. ఇంతకాలం టీడీపీ కోసం పోరాడిన వ్యక్తిని పక్కన పెట్టి ప్రత్యర్థికి టికెట్ ఇస్తారేమో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మొత్తానికి టీడీపీలో టికెట్ ఖాయం అని తానే ఎమ్మెల్యే అవుతానని ఆశగా ఎదురుచూస్తున్న బోడె ప్రసాద్ కి పార్ధసారధి రూపంలో షాక్ తగిలిందంటున్నారు.
మరోవైపు నుంచి టిడిపిలోకి చేరుతున్న పార్థసారథి.. తనకు అర్హత ఉన్నా గతంలో వైసీపీలో మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ కూడా దక్కకపోవడంతో పార్టీ మారుతున్నట్లు చెప్తున్నారు. వైసీపీలో బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ పెనుమలూరు అభ్యర్థిని ప్రకటించడంతో.. ఇప్పుడు అందరి చూపు టిడిపి వైపే ఉంది. టిడిపి నుంచి పెనుమలూరు టికెట్ ని ఎవరికి కేటాయిస్తారో అని ఆసక్తిగా నియోజకవర్గ వాసులు ఎదురుచూస్తున్నారు.