ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి పొరపొచ్చాలు లేకుండా బాగానే ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు, పరస్పరం మర్యాద ఇచ్చి పుచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య కూడా భేదాభిప్రాయాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ కింది స్థాయిలో మాత్రం ఆ స్థాయిలో సఖ్యత లేదు అనే విషయం పదే పదే బయటపడుతోంది. కింది స్థాయి అంటా మరీ కార్యకర్తల స్థాయి కాదు, కనీసం మంత్రుల స్థాయిలో కూడా సర్దుబాట్లు చేసుకోలేని పరిస్థి ఏర్పడింది. అనవసరపు వ్యాఖ్యలు కొంప ముంచేలా ఉన్నాయి. దీనికి తాజా ఉదాహరణే మంత్రి నారాయణ కామెంట్స్. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో ఆయమ చేసిన వ్యాఖ్యలు లీకయ్యాయి. అందులో పిఠాపురం నియోజకవర్గ ప్రస్తావన కూడా ఉంది. దీంతో జనసేన నేతలు మంత్రి నారాయణపై గుర్రుగా ఉన్నారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి నారాయణ వ్యాఖ్యలపై సన్నిహితుల వద్ద సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ఈ గొడవకు కారణం నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కావడం విశేషం. నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ ఓ నాయకుడు బహిరంగ విమర్శలు చేశారు. ఆయనేం చిన్న నాయకుడు కాదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి. ఆయన నెల్లూరు సిటీ నాయకుడు కావడంతో ఆ వ్యవహారం అనుకోకుండా నారాయణ మెడకు చుట్టుకుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ఆరోపణలతో నొచ్చుకున్నారు. తన శాఖపై మంత్రి నారాయణ అనుచరులు ఆరోపణలు చేశారని, ఆయన శాఖ గురించి తాను మాట్లాడిస్తే ఊరుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రి నారాయణను టీడీపీ అధిష్టానం పిలిచి వివరణ కోరింది. ఆయన నెల్లూరు సిటీ నేతలతో వెంటనే టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమిలో విభేదాలు సృష్టించేలా ఏ ఒక్కరూ మాట్లాడొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంలోని మూడు పార్టీలు సఖ్యతతో ఉన్నాయని, దాన్ని దెబ్బతీయొద్దని నాలుగు మంచిమాటలు చెప్పారు. ఆ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ టెలి కాన్ఫరెన్స్ లో నారాయణ పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ-జనసేన మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావించడం ఈ ఎపిసోడ్ కి కొసమెరుపు. నారాయణ వ్యాఖ్యలుగా చెబుతున్న ఆ ఆడియోని సాక్షి మీడియా, సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తోంది.
నారాయణ ఏమన్నారు?
తాను ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్నానని, అక్కడ పిఠాపురంలో రోజూ ఘర్షణ జరుగుతోందని చెప్పుకొచ్చారు నారాయణ. అక్కడ పవన్ కల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ వెరీ ఫెరోషియస్ అని అన్నారు. గతంలో మనం టికెట్ ఇవ్వకపోతే పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచారని గుర్తు చేశారు. ఈమధ్య వర్మ స్టేట్ మెంట్లు ఇస్తుంటే అతడ్ని జీరో చేశామని చెప్పుకొచ్చారు. అతను కూడా తనను జీరో చేశారని అంటుంటారని, కానీ తప్పలేదని చెప్పారు. ఇక్కడ వర్మను జీరో చేశామని నారాయణ అన్నట్టుగా ఉన్న వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి.
Also Read: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్
ఏం జరుగుతుంది?
ప్రస్తుతానికి ఇది టీకప్పులో తుఫానే అనుకోవాలి. కూటమి బలంగా ఉండాలని అధినేతలు మరింత బలంగా కోరుకుంటున్నారు. బీజేపీని పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు కానీ, టీడీపీ-జనసేన మధ్య బాండింగ్ మాత్రం బలంగానే ఉంది. నారాయణ, నాదెండ్ల మధ్య ఉన్నాయని అనుకుంటున్న విభేదాలు ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే తొలగిపోయేవే. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలుగా ఉండాల్సిన టెలి కాన్ఫరెన్స్ మాటలు, వీడియో కాన్ఫరెన్స్ లు రచ్చకెక్కితే అది కూటమికి ప్రమాదం అని చెప్పక తప్పదు. ఆ విషయంలో నేతలు అప్రమత్తంగా ఉంటే కూటమిలో విభేదాలు ప్రతిపక్షం కలగానే మిగిలిపోతాయి.
Also Read: ఏపీకి రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు..