Kakinada Blast: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సంభవించిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఆయన.. పేలుడు జరిగిన తీరును, ధ్వంసమైన పరిశ్రమ పరిసరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఘోర ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాణసంచా తయారీ పరిశ్రమ నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో ఆరా తీశారు. అధికారులతో కలిసి సహాయక చర్యల పురోగతిని సమీక్షించడమే కాకుండా, శిథిలాల తొలగింపు మరియు గాలింపు చర్యల గురించి వివరాలను సేకరించారు.
ముఖ్యమంత్రి వెంట భారతీయ జనతా పార్టీ (భాజపా) రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రుల తాజా ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను, ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కర్మాగారంలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ అగ్నిప్రమాద ఘటనపై స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందుతోందని ఆయన వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దారుణ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని కోరుకుంటూ.. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ఈ భారీ ప్రమాదం పట్ల తెలంగాణ ప్రభుత్వం తరపున ఆయన సంతాపం ప్రకటించారు.
వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కార్మికుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిరంతరం మాట్లాడుతూ వివరాలను ఆరా తీస్తున్నారు.
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ భారీ పేలుడు సమాచారం తెలిసి మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదమని ఆయన పేర్కొన్నారు. మృతులకు నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు.
Read Also: Kakinada Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన 18 మంది కూలీలు