Sajjala Bargav Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. భార్గవ్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో మంగళగిరిలో భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు అందించారు. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం పదిహేను మందికి నోటీసులు అందజేయగా వారంతా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
Also read: మాజీ ఎమ్మేల్యే కన్నుమూత.. 8 సార్లు పోటీ.. 3 సార్లు విజయం..
ఇదిలా ఉంటే అధికారపార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేయడం, అసభ్య కామెంట్లు చేయడం లాంటివి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఈ కేసులో వర్రా రవీందర్ రెడ్డి ఏ1గా ఉండగా సజ్జల భార్గవ్ రెడ్డి ఏ2, అర్జున్ రెడ్డి ఏ3గా ఉన్నారు. భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి విదేశాలకు పారిపోతారనే అనుమానం రావడంతో ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. వైసీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా భార్గవ్ రెడ్డి వ్యహరించడంతో ఈ కేసులో ఆయన కీలక వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్గవ్ రెడ్డిని విచారించి అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తరవాతనే వ్యక్తిగతంగా విమర్శించడం మొదలైందని రవీందర్ రెడ్డి విచరాణలో చెప్పారు. మరోవైపు అర్జున్ రెడ్డి వైసీపీ రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కూడా విచారించి అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు.