Vooke Abbaiah: తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. ఈయన హైదరాబాద్ లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన అబ్బయ్య, వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం..
భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన అబ్బయ్య 1983లో సీపీఐ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో తొలిసారిగా బూర్గంపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు. 1985, 1989 లలో రెండు దఫాలుగా సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అనంతరం 1994లో ఇల్లందు నుండి మరోమారు పోటీ చేసి విజయాన్ని చవిచూశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2009 లో టీడీపీ లో చేరిన అబ్బయ్య స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించి, 2014 లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తన రాజకీయ జీవితంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్న అబ్బయ్య, రాజకీయరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈయన మృతి చెందడం పై పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బూర్గంపాడు, ఇల్లందు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా అబ్బయ్య అందించిన ప్రజా పాలనను ఎప్పటికీ మరువలేమని నియోజకవర్గాల ప్రజలు తెలిపారు.