Weather Update: వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు చలి.. మరో వైపు వర్షాల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం గత కొన్ని గంటలుగా స్థిరంగా కదులుతోంది. ఇది తొలుత తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసినప్పటికీ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇది వాయుగుండం స్థాయిలోనే కొనసాగుతోంది.
తీవ్ర వాయుగుండం.. బంగాళాఖాతంలో పెరిగిన అలల ఉధృతి
ప్రస్తుతం ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నా మధ్య ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
అన్ని పోర్టులకు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు..
ఈ నేపథ్యంలో తూర్పు తీరంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ జిల్లాలో భారీ వర్షాలు..
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు చలి తీవ్రత కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్..
మరోవైపు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వరి కోత దశలో ఉన్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షం వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: సంక్రాంతి ఎఫెక్ట్! ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు.. హైవేపై ఫుల్ ట్రాఫిక్!
ప్రస్తుతానికి తుఫాను ముప్పు తప్పినప్పటికీ, వాయుగుండం ప్రభావంతో కురిసే వర్షాలు వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించవచ్చు. విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అత్యవసర సమయాల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలని సూచించింది. రాబోయే 24 గంటలు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.