Amit Mishra On Virat Kohli: టీమిండియా ఒకప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) అలాగే కోచ్ గా పని చేసిన అనిల్ కుంబ్లే (Anil Kumble ) మధ్య తీవ్ర గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడకపోవడంతో.. అనిల్ కుంబ్లే ఏడాది తిరిగి లోపే.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. 2016 సమయంలో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనిల్ కుంబ్లే, 2017 రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరి గొడవ పై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లేను ఒక్కసారి కూడా విరాట్ కోహ్లీ గౌరవంగా పిలువలేదని ఫైర్ అయ్యారు. కుక్క కంటే హీనంగా అతడిని చూసి అవమానించాడని మండిపడ్డారు. అతడిని టీమిండియా నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళగొట్టాలన్న కసితో కనిపించాడు తప్ప… ఏ రోజు కూడా అనిల్ కుంబ్లేకు సరైన గౌరవం ఇవ్వకపోవడం దారుణమన్నారు. దీంతో అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2016లో టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్నారు అనిల్ కుంబ్లే. ఆ సమయంలో టీం ఇండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించారు. అయితే అనిల్ కుంబ్లే డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో చాలా కఠినంగా వ్యవహరించే వారట. ఒక హెడ్ మాస్టర్ తరహాలో ప్లేయర్లను ట్రీట్ చేసే వారిని సమాచారం. డ్రెస్సింగ్ రూమ్ లో భయానక వాతావరణన్ని కూడా సృష్టించేవారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం అంతా జూనియర్ క్రికెటర్లతో పాటు విరాట్ కోహ్లీకి నచ్చలేదని సమాచారం. దీనిపై బీసీసీఐకి కూడా విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేసినట్లు మాజీ బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ వినోద్ రాయ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
2017 లో ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా టీమిండియా ఓ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకురావాలని అనిల్ కుంబ్లే విశ్వప్రయత్నాలు చేశారు. అయితే దీనిని విరాట్ కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ తుది జట్టులోకి తీసుకువచ్చిన అనిల్ కుంబ్లే, మ్యాచ్ గెలిచేలా చేశాడు. కుల్దీప్ అద్భుతంగా రాణించిన నేపథ్యంలోనే టీమ్ ఇండియా గెలిచింది. దీంతో కోహ్లీ అలాగే అనిల్ కుంబ్లే మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
BCCI మాజీ మేనేజర్ రత్నాకర్ శెట్టి పుస్తకం ప్రకారం.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ పై టీమిండియా ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ లో నో బాల్ వేసినందుకు డ్రెస్సింగ్ రూమ్ లో బూమ్రాపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారట అనిల్ కుంబ్లే. అయితే అప్పుడు బుమ్రాను వెనుకేసుకు వచ్చాడట కోహ్లీ. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేసినట్లు చెబుతూ ఉంటారు. ఇదే విషయాన్ని అమిత్ మిశ్రా తాజాగా స్పష్టం చేసారు.