1980s Bollywood Cars: 1980లలో బాలీవుడ్ సినిమాలు అనగానే యాక్షన్, ఫైట్లు, ఛేజింగ్ సీన్లు, విలన్లు గుర్తుకొస్తారు. అయితే, అప్పటి సినిమాలను జాగ్రత్తగా గమనిస్తే మరో విషయం కూడా కనిపిస్తుంది. అదే కార్లు. ఇప్పటిలా పలు రకాల SUVలు, లగ్జరీ కార్లు, సూపర్ కార్లు అందుబాటులో లేకపోవడంతో అప్పటి సినిమాల్లో కొన్ని ప్రత్యేకమైన కార్లే పదేపదే కనిపించేవి. వాటిలో కొన్ని సినిమాల వల్ల మరింత పాపులర్ అయ్యాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1980ల ముంబైని ఊహించుకుంటే ముందుగా గుర్తొచ్చే కార్లలో ప్రీమియర్ పద్మిని ఒకటి. మొదట ఫియట్ 1100 డిలైట్ పేరుతో వచ్చిన ఈ కారును ప్రీమియర్ ఆటోమొబైల్స్ తయారు చేసింది. తర్వాత దీనికి ప్రీమియర్ పద్మిని అనే పేరు వచ్చింది. ముంబై వీధుల్లో టాక్సీగా కూడా విస్తృతంగా కనిపించిన ఈ చిన్న సెడాన్, అప్పటి సినిమాల్లోనూ సహజంగానే చోటు సంపాదించింది. ‘పురానా మందిర్’, ‘బలిదాన్’ లాంటి సినిమాల్లో బాగా కనిపించింది. ముఖ్యంగా ఛేజింగ్ సీన్లలో ఆకట్టుకునేది.
అంబాసిడర్‌కు వెండితెరపై మరో రకమైన ఇమేజ్ ఉండేది. పెద్ద లుక్, గంభీరమైన డిజైన్ కారణంగా అధికారులు, రాజకీయ నాయకులతో పాటు పెద్దమనుషుల కారుగా గుర్తింపు పొందింది. 1957లో దేశంలో ఉత్పత్తి ప్రారంభమైన అంబాసిడర్‌కు మోరిస్ ఆక్స్ ఫర్డ్ తో సంబంధం ఉంది. 1980లలో ఇది ప్రభుత్వ వర్గాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అధికారానికి ప్రతీకగా నిలిచింది. ముఖ్యమైన పాత్ర అంబాసిడర్ నుంచి దిగితే, ఆ పాత్రకు ఉన్న హోదా ప్రేక్షకులకు వెంటనే అర్థమయ్యేది.
1983లో భారత మార్కెట్లోకి వచ్చిన మారుతి 800, దేశంలోని కార్ల ప్రపంచాన్నే మార్చేసింది. చిన్న పరిమాణం, లేటెస్ట్ లుక్, సులభమైన వినియోగం కారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో బాగా ఆదరణ పొందింది. అప్పటి వరకు పెద్ద కార్లే ఎక్కువగా కనిపించిన భారతీయ రోడ్లపై మారుతి 800 కొత్త తరానికి ఐకాన్ గా మారిపోయింది. అందుకే 1980ల సినిమాల్లోనూ బాగా పాపులర్ అయ్యింది.
యాక్షన్ సినిమాలకు మహీంద్రా జీప్ ప్రత్యేకంగా సరిపోయేది. మంచి బిల్డ్ క్వాలిటీ, నాలుగు చక్రాల డ్రైవ్ సామర్థ్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలు, కొండలు, మట్టి రోడ్లలోనూ సులభంగా ప్రయాణించగలిగేది. పోలీసులు, సైన్యం, ఇతర ప్రభుత్వ విభాగాల్లో దీని వినియోగం కూడా ఎక్కువగా ఉండేది. అందుకే సినిమాల్లో పోలీస్ ఛేజింగ్, విలన్ వెంటపడే సన్నివేశాలు, అడవుల్లో జరిగే యాక్షన్ సీన్లలో జీప్ సహజంగా కనిపించేది.
1984లో వచ్చిన హిందుస్థాన్ కాంటెస్సా అప్పటి భారతీయ కార్లలో కాస్త భిన్నంగా కనిపించింది. పొడవైన బాడీ, తక్కువ ఎత్తు, ఎగ్జిక్యూటివ్ సెడాన్ తరహా డిజైన్ దీనికి ప్రత్యేకమైన లుక్ ఇచ్చాయి. ఇతర సాధారణ కార్లతో పోలిస్తే కాంటెస్సా మరింత ఖరీదైన, స్టైలిష్ కారుగా కనిపించేది. అందుకే సినిమాల్లో ధనవంతులు, ప్రభావవంతమైన వ్యక్తులు, స్టైలిష్ పాత్రల కోసం దీనిని ఉపయోగించేవారు. తర్వాత ఇసుజు ఇంజిన్‌తో వచ్చిన వెర్షన్లు కూడా కార్ ప్రియుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
1980లలో దేశంలో కార్ల ఆప్షన్ పరిమితంగా ఉండేవి. ప్రజలు నిజ జీవితంలో చూసే కార్లే సినిమాల్లోనూ ఎక్కువగా కనిపించేవి. పద్మిని ముంబై జీవనశైలిని, అంబాసిడర్ అధికారాన్ని, మారుతి 800 కొత్త తరాన్ని, మహీంద్రా జీప్ యాక్షన్‌ను, కాంటెస్సా స్టైల్‌ను ప్రతిబింబించాయి.
Read Also: పుతిన్ ఆరస్ vs జిన్ పింగ్ హాంగ్ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్ ఫుల్?