పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం కనపడింది. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు కొన్ని స్లిప్పులు కూడా కనిపించాయి. ఈ స్లిప్పుల వివరాలను టీడీపీ సోషల్ మీడియాలో పంచుకుంది. “మా వివేకా సార్ కి న్యాయం చేయండి సార్ ” అంటూ స్లిప్ రాసి ఓ అజ్ఞాత వ్యక్తి బ్యాలెట్ బాక్సులో వేశాడని అంటున్న టీడీపీ.. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, వివేకా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. మరో స్లిప్ లో “30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు”. అని రాసి ఉంది. దీన్ని ప్రజాస్వామ్య విజయంగా టీడీపీ అభివర్ణించింది. 30 ఏళ్లుగా అక్కడ పోలింగ్ జరగకుండా బలవంతపు ఏకగ్రీవాలతో వైఎస్ఆర్ ఫ్యామిలీ నెట్టుకొచ్చారని, ఇన్నాళ్లకు పులివెందుల కోట బద్ధలైందని, ప్రజాస్వామ్యం గెలిచిందని అంటున్నారు.
ఈ ఒక్క స్లిప్ చాలు 30 ఏళ్లుగా పులివెందులలో జగన్ అరాచకం ఎలా రాజ్యమేలిందో చెప్పడానికి. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేయనిచ్చే వారు కాదు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైనా ప్రజలను ఓటు వేయనిచ్చే వారు కాదు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమా అని పులివెందులలో… pic.twitter.com/qlCQusUTYJ
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2025
ప్రజల అభిమతం ఏంటి?
30 ఏళ్లుగా ఓ ప్రాంతంలో ఓటింగ్ జరగకుండా ఏకగ్రీవాలు అయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం నామినేషన్ వేసిన వారు కూడా పోటీ చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. ఎవరైనా నామినేషన్ వేస్తే భయపెట్టి, బెదిరించి వారితో విత్ డ్రా చేయించేవారని అంటున్నారు. 30 ఏళ్లుగా అక్కడ నిరంకుశ పరిస్థితులున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికల జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ప్రభుత్వ కనుసన్నల్లో పోలీసులు, అధికారులు టీడీపీకి అండగా నిలబడి ఆ పార్టీకి ఓట్లు వేయించారని వైసీపీ ఆరోపిస్తోంది. దొంగఓట్లతో ఈ ఎన్నికను టీడీపీ గెలిచిందనేది వారి ఆరోపణ. అయితే సామాన్య ప్రజలు మాత్రం 30 ఏళ్ల తర్వాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉన్నారంటూ స్లిప్పులు బయటపడటం విశేషం. ఏకగ్రీవాలు బలవంతం అయినా, కాకపోయినా అవి ఎక్కువకాలం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అంటారు. దాదాపుగా 30 ఏళ్లు ఏకగ్రీవాలంటే అనుమానించాల్సిన విషయమే. తాజా ఉప ఎన్నికల్లో పులివెందులలో ఏకంగా 11 నామినేషన్లు దాఖలవడం విశేషం.
పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా, కట్టలు కట్టే క్రమంలో బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ స్లిప్. "మా వివేకా సార్ కి న్యాయం చేయండి సార్ " అంటూ స్లిప్ రాసి బ్యాలెట్ బాక్సులో వేసిన అజ్ఞాత వ్యక్తి.
సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో, త్వరలోనే న్యాయం జరుగుతుందని… pic.twitter.com/yaO1TfGswX
— Telugu Desam Party (@JaiTDP) August 14, 2025
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ స్థానాలను టీడీపీ గెలుచుకోవడం పెద్ద విషయం కాకపోయినా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజల అభిమతం మరోసారి తెలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని వైసీపీ అంటున్నా ఈ ఎన్నికలు వారి వాదనను నీరుగార్చాయనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం, పులివెందులలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడంతో ప్రజలు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ అంటోంది. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందులే ఫలితాలు ఇలా వచ్చాయని కూటమి నేతలు చెబుతున్నారు. ఓటమి నుంచి వైసీపీ ఇంకా గుణపాఠాలను నేర్చుకోలేదని వారు విమర్శిస్తున్నారు.
వైనాట్ పులివెందుల?
పులివెందులలో వైఎస్సార్ కుటుంబాన్ని కాదని ఎవరూ బరిలో దిగలేరనేది ఇన్నాళ్లూ ఉన్న టాక్. దాన్ని తుడిచేసింది టీడీపీ. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అంటూ జగన్ గాలిలో మేడలు కట్టారు, చివరకు 11కి పరిమితం అయ్యారు. ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ ఆ మాటల్ని టీడీపీ నిజం చేసింది.