జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి రావట్లేదు. పోనీ జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు సరే, మిగతా 10మంది అయినా తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించొచ్చు కదా? తమ ప్రాంతాలకు రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా? జగన్ రాకపోవడంతో మొత్తం ఎమ్మెల్యేల టీమ్ టీమంతా అసెంబ్లీకి డుమ్మాకొట్టింది. పోనీ మండలికయినా నేతలు హాజరవుతున్నారని అనుకుంటే అక్కడ కూడా రచ్చ రచ్చే. ప్రతి సందర్భంలోనూ మండలిలో తమ మాట నెగ్గాలని ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు. మంత్రుల ప్రసంగాలకు అడ్డు తగులుతూ, అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ పెద్దల సభలో కూడా రచ్చ చేస్తున్నారు.
కుప్పం ఎమ్మెల్యే?
సభాపతి స్థానం తర్వాత ముఖ్యమంత్రికి లీడర్ ఆఫ్ ది హౌస్ గా అత్యథిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే నేరుగా ఆయన్నే కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించి వైసీపీ ఎమ్మెల్సీ ఇరుకున పడ్డారు. ఇది సభా సంప్రదాయం కాదనే విషయం అందరికీ తెలుసు. గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా ప్రవర్తించిన తీరు లేదు. అయినా కూడా వైసీపీ ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. దీంతో టీడీపీ సభ్యులు ఆయనకు అడ్డు తగిలారు. ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, కనీస గౌరవం లేకుండా ఆయన్ను అలా ప్రస్తావించడం సరికాదని, రమేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని మండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ సహా ఇతర సభ్యులు డిమాండ్ చేశారు. జగన్‌ను మాఫియా డాన్ లేదా, పులివెందుల పులకేసి అని సభలో పిలిస్తే వైసీపీ సభ్యులు అంగీకరిస్తారా? ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బొత్సను మండలిలో ప్రతిపక్ష నాయకుడిగానే తాము సంబోధిస్తున్నామని, అలాంటిది తమ నాయకుడిని ఎమ్మెల్యే అంటూ సంబోధించడం సరికాదని టీడీపీ సభ్యులు అన్నారు. అయితే ఆ తర్వాత బొత్స కూడా తమ సభ్యుడి మాటల్ని సమర్థించడం మరింత మంటరాజేసింది. బొత్స సమర్థింపుపై కూటమి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నాయకుడి పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం సరి కాదని, రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు కౌన్సిల్ చైర్మన్ ను కోరగా ఆయన రికార్డులు పరిశీలించి, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధమని ప్రకటించారు. అనంతరం సభ వాయిదా పడింది.
అసెంబ్లీలో జరిగే చర్చల్లో వైసీపీ సభ్యులు పాల్గొనడం లేదు, మండలిలో అయినా సరే చర్చల్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. మంత్రుల ప్రసంగాలకు అడ్డు తగులుతున్న ఉదాహరణలు కోకొల్లలు. అవసరం లేకపోయినా కుప్పం ఎమ్మెల్యే లాంటి ప్రస్తావనలతో మరింత అలజడి సృష్టించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించడం గమనార్హం. వైసీపీ సభ్యులలో ఒకరిద్దరు మినహా మిగతా వారెవరూ సబ్జెక్ట్ మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. సభలో రచ్చ చేసి, తమ సంఖ్యాబలం చూపించేందుకు వారు ఉత్సాహపడుతున్నట్టు తెలుస్తోంది.