Punganur Murder Case: మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు పుంగనూరు మర్డర్ కేసు చుట్టుకుంటోంది. రాజకీయంగా అడ్డుగా ఉన్నాడనే కారణం కక్ష పెంచుకొని TDP కార్యకర్తను చంపేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వెంకట్రమణ ప్రధాన నిందితుడు. వెంకట్రమణ మరో నలుగురితో కలిసి TDP కార్యకర్త కె రామకృష్ణను పథకం ప్రకారం కిరాతకంగా వేటకొడవలితో హతమార్చారని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.
కేసు వివరాలను ఎస్పీ మణికంఠ వెల్లడించారు. పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు కాగతి రామకృష్ణ TDPలో చురుకైన కార్యకర్త. భూ ఆక్రమణలను, అవినీతిని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు ఆయన. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా రామకృష్ణ కుటుంబం సంబరాలు జరుపుకుని కేక్ కట్ చేయడానికి సిద్ధమైంది. దీంతో YCP కార్యకర్త వెంకట్రమణ, మరో వ్యక్తి గొడవచేసి రామకృష్ణ భార్య కాళ్లు విరిగేలా కొట్టారు. అంతే కాకుండా రామకృష్ణ కుటుంబంతో తరచూ గొడవ పడేవారు.
గత నెల 10వ తేదిన మట్టి టిప్పర్ తమ స్థలంలో వెళ్లిందంటూ వెంకట్రమణ మరికొందరు గొడవకు దిగారు. రామకృష్ణ కుమారుడు, కోడలిపై దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో పుంగనూరు సీఐ ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. కానీ సీఐ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో దర్యాప్తులో పురోగతి లేకపోయింది. రాజకీయ కక్షలు తీవ్రస్థాయికి చేరి పుంగనూరు మండలం గానుగులగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు ఎం రెడ్డెప్ప రెడ్డి పథకం ప్రకారం హత్యకు మూలకర్తగా వ్యవహరించారు. రామకృష్ణ కుమారుడు సురేశ్‌ను చంపాలని వెంకట్రమణ వేట కొడవలితో నరకడానికి ప్రయత్నించగా.. చెయ్యి అడ్డుపెట్టి తప్పించుకున్నాడు. ఈలోపు ట్రాక్టర్‌లో ఇంటికి వచ్చిన రామకృష్ణను వెంకట్రమణ దారుణంగా కొడవలితో నరికి చంపి పారిపోయాడు.
Also Read: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వైసీపీ నేత శ్యామల.. అరెస్టు చేస్తారా?
రామకృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట్రమణను, ఎం రెడ్డెప్పరెడ్డిని అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ప్రధాన కుట్రదారుడు రెడ్డెప్ప రెడ్డి హత్యకు ముందు తర్వాత నిందితులతో ఫోన్ సంభాషణలోనే ఉన్నాడు. అలాగే YCPకి చెందిన పుంగనూరు MPP అక్కిసాని భాస్కర రెడ్డి, PKM అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ ఛైర్మన్ ఎన్ వెంకటరెడ్డి యాదవ్, YCP నేత చెంగా రెడ్డిలతో నిందితుడు వెంకట్రమణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. హత్యలో ప్రధాన నిందితులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కావడంతో.. ఈ కేసు దర్యాప్తులో పెద్దిరెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్రంగా విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.