Amitabh Bachchan: బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 82 ఏళ్ల వయస్సులో కూడా ఆయన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీగా నిలిచారు. ఈ క్రమంలో అమితాబ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి అత్యధిక ఆదాయం సంపాదించి, అత్యధిక పన్ను చెల్లించారు. ఓ నివేదిక ప్రకారం, అమితాబ్ బచ్చన్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 350 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ ఆదాయంపై ఆయన చెల్లించిన పన్ను మొత్తం రూ. 120 కోట్లు.
గత ఏడాది కంటే..
అమితాబ్ బచ్చన్ తన ఆదాయాన్ని పన్ను రూపంలో అధిక మొత్తంలో చెల్లించడం ఇప్పుడేమి కొత్త విషయం కాదు. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కూడా ఆయన రూ. 71 కోట్లు పన్ను చెల్లించారు. అయితే, ఈసారి ఆయన చెల్లించిన పన్ను 69% పెరగడం విశేషం. మార్చి 15, 2025న అమితాబ్ తన చివరి వాయిదాగా రూ. 52.50 కోట్ల ముందస్తు పన్ను చెల్లించారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత అధిక మొత్తం కావడం విశేషం.
ఆదాయ వనరులు
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో 6 దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ చిత్రం మంచి విజయం సాధించింది. త్వరలో ‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభించబోతున్నారని సమాచారం. దీంతోపాటు బిగ్ బీ మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
Read Also: Business Idea: తక్కువ పనితో నెలకు రూ. 2 లక్షలకుపైగా …
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు
అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ అత్యధిక డిమాండ్ ఉన్న నటుడు. ప్రముఖ బ్రాండ్‌లు, లగ్జరీ ఉత్పత్తులు, ఆరోగ్యపరమైన ఉత్పత్తులు, బ్యాంకింగ్ సేవల వంటి విభాగాల్లో అమితాబ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, అమితాబ్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 5 నుంచి రూ. 10 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)
అమితాబ్ నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో ప్రజాదరణ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 20 ఏళ్లుగా అమితాబ్ ఈ షోకు హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా ఆయన సంవత్సరానికి రూ. 30-40 కోట్ల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
ఆస్తుల విక్రయం
అమితాబ్ బచ్చన్ ఆదాయంలో మరో కీలక భాగం ఆస్తుల విక్రయం. ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ ముంబైలోని ఓషివారాలో ఉన్న క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అట్లాంటిస్లో తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ. 83 కోట్లకు విక్రయించారు. ఇది 1.55 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో 4, 5, 6 BHK ఫ్లాట్‌లు ఉన్నాయి.
అమితాబ్ విజయ రహస్యం
అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయస్సులో కూడా మంచి డిమాండ్ ఉన్న నటులలో ఒకరు కావడం విశేషం. 6 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆయన, ఇప్పటికీ ప్రతి ప్రాజెక్ట్‌ను అత్యంత నిబద్ధతతో చేస్తారు. అందుకే అమితాబ్ అంటేనే బ్రాండ్ వాల్యూ. ఈ క్రమంలో ఆయనతో చేయాలని అనేక కంపెనీల బ్రాండ్లు, సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తారు. అమితాబ్ సినీ ప్రస్థానం 1969లో ‘సాత్ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. ‘జంజీర్’, ‘డాన్’ లాంటి సినిమాలతో ఆయన సూపర్‌స్టార్‌గా మారారు.