Weather Alert: దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ తుఫాన్ గండం మొదలైంది. బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడనుంది. ఇది నవంబర్ 13 నుంచి 20 మధ్య ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాన్ ఏర్పాటుపై సంకేతాలు ఇస్తున్న అంతర్జాతీయ వాతావరణ నమూనాలు, తుఫాను తీరం దాటే ప్రాంతంపై భిన్నంగా అంచనా వేస్తున్నాయని తెలిపారు. కొన్ని విశాఖపట్నం వైపు తుఫాన్ పయనించే అవకాశం ఉందని చెబుతున్నాయని, మరికొన్ని బంగ్లాదేశ్ తీరాన్ని తాకవచ్చని చెబుతున్నాయని వివరించారు.
ఇంకొన్ని బాపట్ల తీరం, చెన్నై వైపు, ఒడిశాలోని గోపాలపురం తీరాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి తుఫాను దిశ, ప్రయాణ మార్గం, తీరం దాటే ప్రాంతం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదన్నారు. నవంబర్ 13 నాటికి తుఫాను ఏర్పాటుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు అధికారిక వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
శనివారం నుండి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతం వైపు వేటకు వెళ్లరాదని తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం లేదని, రాబోయే రోజుల్లో అది ఎటు పయనిస్తుందనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు అధికారుల హెచ్చరికలను పాటించాలన్నారు. వాతావరణ పరిస్థితులపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచన చేశారు.
ALSO READ: విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే.. ట్యాగ్ లైన్‌కు తగినట్లే జెండా!