300 KM Range Electric Scooters: పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈవీ స్కూటర్ కొనేటప్పుడు బ్యాటరీ కెపాసిటీతో పాటు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చనేది కూడా చాలా ముఖ్యం. సాధారణంగా సింగిల్ ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే స్కూటర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, అంతకంటే ఎక్కువ రేంజ్ ఇస్తామని కంపెనీలు చెబుతున్న కొన్ని మోడళ్లు కూడా భారత మార్కెట్లో ఉన్నాయి. దాదాపు 300 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ క్లెయిమ్‌డ్ రేంజ్ అందించే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఓలా ఎలక్ట్రిక్ అందిస్తున్న S1 Z స్కూటర్‌లో 5.1 kWh బ్యాటరీ వేరియంట్ మంచి రేంజ్ ను కలిగి ఉంటుంది. ఈ వెర్షన్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 301 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1,06,127గా ఉంది.
ఓలా S1 ప్రో సిరీస్‌లోని ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన కొన్ని వేరియంట్లు 320 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తాయి. మంచి పనితీరు, అత్యాధునిక ఫీచర్లతో పాటు ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
300 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే స్కూటర్ల లిస్టులో కొమాకి XR7 కూడా ఉంది. ఈ స్కూటర్ లో హై రేంజ్ కలిగిన బ్యాటరీ సెటప్‌ను అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 322 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.
కొమాకి వెనిస్‌తో పాటు కంపెనీకి చెందిన కొన్ని హై-స్పీడ్ మోడళ్లలో డ్యూయల్ బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాటరీ ప్యాకేజీలను బట్టి 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే, వేరియంట్‌ను బట్టి ఈ వివరాలు మారే అవకాశం ఉంది.
కంపెనీలు ప్రకటించే రేంజ్ సాధారణంగా టెస్టింగ్ లో తేలిన రిజల్ట్. రోజువారీ ప్రయాణాల్లో మాత్రం ఇదే రేంజ్ వస్తుందని చెప్పలేం. రోడ్ల పరిస్థితి, ప్రయాణించే వేగం, స్కూటర్‌పై ఉండే బరువు, రైడింగ్ మోడ్ వంటి అంశాలు బ్యాటరీ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా 70 నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణించడం, తరచూ బ్రేకులు వేయడం, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఫీచర్ల వినియోగం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో, వాస్తవ వినియోగంలో కంపెనీ ప్రకటించిన గరిష్ట రేంజ్ కంటే కాస్త తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.
Read Also: టాటా To ఎంజీ.. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!